ys jagan - telugu film industryసినీ వ్యాపారానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్ వ్యాపారాన్ని పునఃప్రారంభించడానికి సహాయపడే కొన్ని నిర్ణయాలను ప్రకటించింది. మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమైన రంగం సినిమా ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి. మిగతావి ఎంతో కొంత ఇప్పటికే కోలుకున్న సినిమా మొదలు కూడా ఇంకా అవ్వలేదు.

గతంలో ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే, కోవిడ్ మహమ్మారి కాలానికి సినిమా హాళ్లకు స్థిర విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. అలాగే పరిశ్రమకు ఉపయోగపడేలా ఒక ‘రీస్టార్ట్ ప్యాకేజీ’ కూడా కేబినెట్ ప్రకటించింది. అదే సమయంలో రాష్ట్రంలోని 1100 సినిమా థియేటర్లకు ప్రభుత్వం రుణాలు ఇవ్వనుంది.

అలాగే తీసుకున్న రుణాలపై వడ్డీలు మినహాయించబడతాయి. మరో వైపు… ఏప్రిల్, మే, జూన్ 2020 లలో థియేటర్లకు స్థిర విద్యుత్ ఛార్జీలు కూడా రద్దు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే తరువాత థియేటర్లు మూసి ఉన్న ప్రస్తుత కాలానికి సంబంధించిన ఛార్జీలను వాయిదాలలో చెల్లించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ చర్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ప్రభుత్వం నుండి అధికారిక జీవో వచ్చాకా అర్ధం అవుతాయి. ఏది ఏమైనా క్రిస్మస్ నుండి పరిశ్రమ రీస్టార్ట్ కానున్న తరుణంలో ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన పరిశ్రమకు, దాని మీద ఆధారపడిన వారికి రిలీఫ్ ని ఇస్తుంది అనే చెప్పుకోవచ్చు.