YS Jagan Targets Pawan Kalyanగత సార్వత్రిక ఎన్నికలలో జగన్ నుండి అధికారం దూరం కావడానికి ఉన్న అనేక కారణాలలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఆ ఎన్నికలు ముగిసిన రెండున్నర్రేళ్ళు ముగియగా, మరో రెండు సంవత్సరాలలో మళ్ళీ ఎన్నికల హంగామా ప్రారంభం కానుంది. దీంతో ఈ రెండేళ్ళల్లో ఎలాగైనా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమ వైపుకు మలుచుకోవాలని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు వదిలేసిన ‘ప్రత్యేక హోదా’ నుండి కుల రాజకీయాల వరకు ప్రతి అంశంలో రాజకీయంగా లబ్ధి పొందాలని చేస్తున్న విఫల యత్నాలు రాజకీయ విజ్ఞులకు తెలిసిందే.

అయితే ఇంత హంగామా చేస్తున్న వైసీపీ అధినేతకు మళ్ళీ పవన్ రూపంలో మరోసారి అడ్డు తగలబోతున్నాడన్న సంకేతాలు వ్యక్తమవుతుండడంతో ‘టార్గెట్ పవన్ కళ్యాణ్’గా సాగాలని ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత రెండు నెలలుగా పవన్ కళ్యాణ్ క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడంతో, పార్టీ పరంగా ‘జనసేన’ గురించి ప్రజలు చర్చించుకోవడం ప్రారంభించారు. అక్కడితో ఆగని పవన్, తన బహిరంగ సభలను కొనసాగిస్తుండడంతో… ఇలాగే ఉపేక్షిస్తే… ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ను పవన్ చీలుస్తాడని, అదే జరిగితే మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమన్న విశ్లేషణలతో జగన్ అలెర్ట్ అయినట్లుగా ఓ టాక్.

అయితే ఇప్పటివరకు తమపై విమర్శలు చేయని పవన్ కళ్యాణ్ పైకి దండయాత్ర చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే… గతంలో రాహుల్ గాంధీ గురించే పరోక్షంగా ‘హోటల్ రూమ్’లంటూ హెచ్చరించిన పవన్, వైసీపీ నేతల గురించి బహిరంగంగా వ్యాఖ్యానిస్తే ఈ ప్రభావం సాధారణ రీతిలో ఉండదు. దీంతో ఒక ప్రణాళికా బద్ధంగా పవన్ ను టార్గెట్ చేయాలనీ వ్యూహాలు రచిస్తున్నారట. పవన్ టార్గెట్ చేసే ముందు… అసలు ఇదంతా చంద్రబాబు గేమ్ ప్లాన్ అని ప్రారంభించి, తద్వారా పవన్ ను ఏకరువు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఇదే ఎదురైనపుడు పవన్ ఎలా డిపెండ్ చేసుకుంటారో చూడాలి.