Chalo -Atmakurఅధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ దాడులు, దౌర్జన్యాలను, అరాచకాలను రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపాలనే ఉద్దేశంతో ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పిలుపునిచ్చిన ‘ఛలో ఆత్మకూరు’ను భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలను ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు.

కొన్ని చోట్ల ముందస్తు అరెస్టులకు కూడా తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ పునరావాస శిబిరానికి ఆహారం సరఫరాను నిలిపివేసి బాధితులను వారి వారి ఇళ్లలకు వెళ్లేలా ప్రెషర్ పెడుతున్నారు. శిబిరం వద్ద నుంచి మీడియాను బలవంతంగా బయటకు పంపివేశారు. పునరావాస శిబిరానికి ఆహారం సరఫరాను పోలీసులు అడ్డుకోవడంపై ప్రతిపక్షనేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావంగా ఆయన నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు.

ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు దీక్షలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. అటు ఆత్మకూరులో చంద్రబాబు ప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సును ఆత్మకూరు నుంచి తరలించారు. ఛలో ఆత్మకూరు నేపథ్యంలో పల్నాడు, గుంటూరులలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్షన్ అమలులో ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించారు.