YS Sharmila - Jaganవైఎస్ షర్మిల పార్టీకి సంబంధించిన ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ)కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏప్రిల్ 30న ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 16 వరకు సమయం ఇచ్చింది. అయితే ఇప్పటివరకూ ఎలాంటి అభ్యంతరాలు రానందున అనుమతుల ప్రక్రియ పూర్తయిందని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఇదే సమయంలో పార్టీ పేరుపై వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకి ఎటువంటి అభ్యంతరం లేదని.. ఆమె ఇచ్చిన లేఖను కూడా ఎన్నికల సంఘానికి అందజేశామని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి.

షర్మిల రాజకీయాలలోకి వస్తామన్న నాటి నుండీ ఈ వ్యవహారం నాకు నచ్చకుండా జరుగుతుందని జగన్ సంకేతాలిచ్చారు. పార్టీకి సోదరికి దూరంగా ఉన్నారు. విజయమ్మ మాత్రమే అప్పుడప్పుడూ షర్మిలకు దగ్గరగా కనిపించారు. అయితే అది నిజమైతే వైఎస్సార్ కాంగ్రెస్ తరపున అభ్యంతరం తెలియజేస్తే పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ఆగిపోయేది.

అయితే అభ్యంతరం లేదని విజయమ్మతో లేఖ ఇప్పించడంతో జగన్ షర్మిలకు మద్దతు ఇచ్చినట్టుగా అయ్యింది. మరోవైపు… వైఎస్ షర్మిల పార్టీని వైఎస్సార్‌ జయంతి (జులై 8) నాడు ఏర్పాటు చెయ్యడానికి విరివిగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. కరోనా పరిస్థితులు అప్పటికి చక్కబడితే భారీ బహిరంగ సభలో పార్టీ పేరుని ప్రకటించాలని అనుకుంటున్నారు.