YS-Jagan-Srikakulam-Speechసిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో తన ప్రభుత్వ నిర్వాకాల గురించి గొప్పగా చెప్పుకొన్న తర్వాత అసలు విషయానికి వచ్చేశారు. అదే… చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, ఈనాడూ, ఆంధ్రజ్యోతిల గురించి మనసులో ద్వేషాన్ని మరోసారి కక్కేశారు.

అయితే ఈసారి ఆయన ప్రసంగంలో కాస్త పురాణ కధలు గురించి మాట్లాడటం గమనిస్తే సిఎం స్క్రిప్ట్ రైటర్ మారినట్లు అర్దమవుతోంది. మొన్న నరసాపురం సభలో నోరు తిరగని పదాలతో స్క్రిప్ట్ తయారుచేయడంతో అది చదవలేక సిఎం జగన్‌ చాలా ఇబ్బంది పడ్డారు. బహుశః అందుకే ఈసారి కాస్త తేలికగా పురాణ కధలు జోడించి స్క్రిప్ట్ తయారుచేసినట్లున్నారు.

ఇంతకీ ఆ పురాణ కధలు ఏమిటంటే, “ఆనాడు దుష్టుడైన దుర్యోధనుడికి అండగా నిలిబడిన ముగ్గురిని కలిపి దుష్టచతుష్టయం అనేవారు. అదేవిదంగా చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, పవన్‌ కళ్యాణ్‌లను ఏమనాలి?దుష్టచతుష్టయమే కదా?

“ఆనాడు పరాయి స్త్రీ మీద కన్నేసి ఎత్తుకుపోయినవాడిని రావణుడు అంటున్నాము. ఆ రావణుడిని సమర్ధించిన వారిని రాక్షసులని అంటున్నాము. ఎన్టీఆర్‌కి ద్రోహం చేసి టిడిపిని కబ్జా చేసిన వ్యక్తిని ఏమనాలి?రావణుడే కదా?ప్రజలను మోసం చేస్తున్న ఆ రావణుడిని సమర్ధిస్తున్నవారిని ఏమనాలి? రాక్షసులే కదా?”

జ్ఞాన గుళిక: “తనకు తాను పార్టీని ఏర్పాటు చేసుకొని అధికారంలోకి వస్తే వారిని ఎంజీఆర్, ఎన్టీఆర్‌, జగన్‌ అంటారు. అదే… పిల్లనిచ్చిన మామ చేతిలో పార్టీని కబ్జా చేసిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు అని అంటాము.”

త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి మాటల మాంత్రికుడు డైలాగ్స్ రాస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవవచ్చు. కానీ తెలంగాణ సిఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, ఎమ్మెల్సీ కవిత వంటి గొప్ప వాగ్ధాటి కలిగిన నేతలు ఎంత గొప్పగా మాట్లాడుతున్నా టిఆర్ఎస్‌ పార్టీకి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి చూపుతున్నా ఉపఎన్నికలలో పార్టీని గెలిపించుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడవలసి వస్తోంది.

మరి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, పోలవరం మద్యలో నిలిపేసి, రాజధాని లేకుండా చేసి, మూడు రాజధానుల పేరుతో ప్రజల మద్య ప్రాంతీయ విబేధాలు రెచ్చగొడుతూ, ఎవరో వ్రాసిన స్క్రిప్ట్ చదివితే బలవంతంగా సభకి తీసుకువచ్చినవారు చప్పట్లు కొడతారేమో కానీ ఓట్లు వేస్తారా?ఆలోచించుకొంటే మంచిది.

లారీలలో స్కూలు విద్యార్ధినులను తీసుకువచ్చి, వారి చేత ఇంగ్లీషులో పొగిడించుకొని అదే అభివృద్ధి అనుకొని సంతోషపడతానంటే తప్పకుండా పడొచ్చు కానీ ప్రజలు మాత్రం కళ్ళకి కనిపించే అభివృద్ధిని కోరుకొంటున్నారని మరిచిపోతే నష్టపోయేది ఎవరు?

తెలంగాణ సిఎం కేసీఆర్‌ మొదలు ఎమ్మెల్యేల వరకు “మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాకు పనితీరుకి గీటురాయి. అది చూసే ఓట్లు వేయండి,” అని రొమ్ము విరుచుకొని చెపుతున్నారు. అలా వైసీపీ నేతలు చెప్పుకోగలరా?చెప్పుకోలేకపోతున్నారంటే అర్దం ఏమిటి? ఏమీ చేయలేదనేగా? ఏమీ చేయకపోతే ఓట్లు ఎవరు వేస్తారు? కావాలంటే ఇలాగే సభలకి వచ్చి చప్పట్లు కొడతారు. సరిపోతుంది కదా?