Ys Jagan speech on independence dayభారత్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్య సమరయోధులను, మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్యను స్మరించుకొన్నారు. చాలా సంతోషం.

ఈ మూడేళ్ళ తన పాలనలో ఏమేమి సాధించారో చెప్పుకొన్నప్పుడు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల గురించి నాలుగు ముక్కలు చెప్పే సాహసం చేయలేకపోయారు. గుంతలు పడిన రోడ్లను ఏదోవిదంగా కప్పి పుచ్చవచ్చు కానీ అప్పుల కుప్పగా మారిన రాష్ట్ర పరిస్థితిని కూడా సంక్షేమ పధకాల దుప్పటి కింద కప్పిపుచ్చడం చాలా గొప్ప విషయమే కదా?

సిఎం జగన్ ఎప్పటిలాగే తన ప్రసంగంలో రాష్ట్ర ప్రజల చెవులు చిల్లులు పడేలా సంక్షేమ పధకాల డప్పు వాయించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మహాద్భుతంగా ఉందని గట్టిగా చెప్పారు. ఈ మూడేళ్ళలో రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు కానీ 40 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.

మాయాబజార్ సినిమాలో శశిరేఖ, ఉత్తరకుమారుల పెళ్ళి జరిగితే చాలా కలహాలు, కష్టాలు వస్తాయని ఒక జ్యోతిష్యుడు చెపితే, కలహాలు అంటే ప్రణయ కలహాలు, కష్టాలు అంటే బహు సంతానం కలగడం అని భాష్యం చెపుతారు మరొకరు.

సిఎం జగన్ తన ప్రసంగంలో పాలనపరమైన సంస్కరణలు చేశామని, పౌరసేవల్లో మార్పులు తెచ్చామని చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్రంలోలాగ అభివృద్ధికి స్పీడు బ్రేకర్లుగా ఉన్న లోపభూయిష్టమైన నియమనిబందనలను తొలగించి, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలను ఆకర్షించడానికి సరళమైన విధానాలను అమలుచేయడం అని భావిస్తే, సంస్కరణలు, పౌరసేవలు అంటే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు అని అర్దం చేసుకోవాలి.

ప్రభుత్వంలో మున్సిపల్‌, రెవెన్యూ తదితర శాఖలలో ఎక్కడికక్కడ కార్యాలయాలు, సిబ్బంది ఉండగా మళ్ళీ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలు సృష్టించి అసమదీయులకు ఉద్యోగాలు, ఆదాయం కల్పించి, ఆ భారం ప్రజలపైనే వేస్తున్నారు. దానినే సంస్కరణలని గొప్పగా చెప్పుకోవడం విశేషం.

వ్యవసాయానికి, రైతన్నలకు ఇస్తున్న రైతు భరోసా వంటి పధకాల గురించి సిఎం జగన్ తన ప్రసంగంలో ఏకరువు పెట్టారు. అయితే రాష్ట్రంలో కౌలు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు?వారి కుటుంబాలకు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఆర్ధికసాయం ఎందుకు అందించవలసి వచ్చింది?వ్యవసాయ మోటర్లకు మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు? వరదలలో వేలాది ఎకరాలలో పంటలు, ఊర్లు, ఇల్లు నీట మునిగితే ప్రభుత్వం వారికి ఏమేరకు సాయపడింది? టొమేటో రైతులు ఎందుకు ఆక్రోశిస్తున్నారు? అనే సందేహాలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మగౌరవం కాపాడమని సిఎం జగన్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళయినా రాజధాని లేకపోవడం ఆత్మగౌరవమా? వైసీపీ నేతల బూతు పురాణాలు, ఆడియోలు, వీడియోలతో రాష్ట్ర ప్రజలు తలదించుకొనేలా చేయడమే ఆత్మగౌరవమా?వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఓ దళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేయడం గొప్ప విషయమా?ఈవిదంగా పాలన సాగించడం చాలా గొప్ప విషయమని సిఎం జగన్ అనుకోవడమే కాక గర్వంగా చెప్పుకొని తనను తాను అభినందించుకొంటున్నారు కూడా. చాలా గ్రేట్ కదా?