YS Jagan Speech at Narasapuram Meetingఈరోజు నరసాపురంలో సిఎం జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే ఎప్పుడు, ఎక్కడ ఏ సభలో ప్రసంగించినా మరిచిపోకుండా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ల నామస్మరణతో పునీతులవుతుంటారు. ఈరోజు జరిగిన సభలో కూడా వారివురిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

టిడిపి ‘ఇదేం ఖర్మ?’ పేరుతో రాజకీయ కార్యక్రమం ప్రారంభించటంపై సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, “గత ఎన్నికలలో టిడిపి పాలన చూసి రాష్ట్ర ప్రజలు మనకి ఇదేం ఖర్మ అనుకొంటూ చంద్రబాబు నాయుడుని, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ని ఓడగొట్టి ఇంటికి పంపించేశారు. చివరికి కుప్పం నియోజకవర్గంలో సైతం టిడిపిని ప్రజలు తిరస్కరించడంతో చంద్రబాబు నాయుడు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఇవే నాకు చివరి ఎన్నికలని చెప్పేశారు కూడా. టిడిపి ఓ బూతుల పార్టీ… జనసేన ఓ రౌడీ పార్టీ. చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకు నాటాకాలు ఆడుతున్నారు. కానీ ప్రజలు వారిని ఇక ఎన్నటికీ నమ్మరు,” అంటూ తాను బటన్ నొక్కి ఏవిదంగా సంక్షేమ పధకాలకు లక్షల కోట్లు విడుదల చేసేస్తున్నారో గొప్పగా చెప్పుకొని వచ్చే ఎన్నికలలో ప్రజలు మళ్ళీ వైసీపీకే పట్టడం ఖాయం అని చెప్పుకొన్నారు.

నిజానికి వర్తమాన రాజకీయాలలో బూతుల తీవ్రత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాకనే బాగా పెరిగిందని అందరికీ తెలుసు. మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి కొడాలి నాని ఇద్దరూ వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తింపు పొందారు కూడా. కనుక బూతుల క్రెడిట్ వైసీపీకే సొంతం.

ఇక జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కాస్త ఆవేశపరుడే కానీ చాలా క్రమశిక్షణతో, హుందాగా వ్యవహరిస్తుంటారని అందరికీ తెలుసు. అయితే ఆయన అభిమానులు, కార్యకర్తలు (కుర్రకారు) వానర సైన్యం వంటిదే అని చెప్పక తప్పదు. తమ అధినేత పవన్‌ కళ్యాణ్‌ అంటే అందరూ ప్రాణం పెట్టడానికి సిద్దం. అయితే ఆయన నుంచి క్రమశిక్షణ, హుందాతనం కూడా నేర్చుకొంటే వారికీ, వారి అధినేతకి, పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది. ప్రజలలో వారిపట్ల గౌరవభావం పెరుగుతుంది.

రాజకీయాలలో మాటకారితనం, ముఖ్యంగా ప్రజలను మెప్పించగలిగేలా మాట్లాడటం చాలా అవసరమే. అయితే అవి కేవలం అదనపు అర్హతలే అవుతాయి వాటినే చూసి ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేయరు. వేస్తారనుకొంటే కేసీఆర్‌ కుటుంబంలో అందరూ మాటకారులే. టిఆర్ఎస్‌ పార్టీలో అనేకమంది అద్భుతంగా మాట్లాడేవారున్నారు. అయినాకూడా అవలీలగా ఒంటిచేత్తో గెలవాల్సిన ఓ ఉపఎన్నికకు కూడా టిఆర్ఎస్‌ సర్వశక్తులు ఒడ్డి పోరాడవలసి వస్తోంది.

కనుక వైసీపీ నేతలు కూడా ఎంత మాటకారితనంతో మాట్లాడామని అనుకొంటున్నప్పటికీ, ఈ మూడున్నరేళ్ళలో ఏం సాధించి చూపారు? రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందింది? మిగిలిన రెండేళ్ళలో ఏం చేస్తారు? రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు, పెట్టుబడులు సాధించారు?వాటితో ఎంతమందికి ఉద్యోగాలు, ఉపాది కల్పించారు?వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే ప్రజలు ఓట్లు వేస్తారు.

కానీ ఈ మూడున్నరేళ్ళలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కనపడదు కానీ జగన్‌ బటన్ నొక్కిన ప్రతీసారి ‘అప్పుల కొండ’ పెరిగిపోతుండటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. సంక్షేమ పధకాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. కానీ వాటి కోసం చేసిన అప్పులు, వడ్డీల చెల్లింపుల కోసం పన్నులు, ఛార్జీల భారం పెంచేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలపై దాడులు, అరాచకాలు, కూల్చివేతలు స్పష్టంగా కనిపిస్తాయి. కనుక ‘ఆదాయం సున్నా వ్యయం 10’ అన్నట్లు సాగుతున్న వైసీపీ పాలన చూసి ప్రజలు ‘ఇదేం ఖర్మ’ అనుకొంటుంటే, సిఎం జగన్‌ ‘ఇదేం ఖర్మ’ని తమకు అనుకూలంగా చెప్పుకొంటే అది వైసీపీ ఖర్మ అవుతుంది.