ys jagan speech at vijayawadaరోజులు గడుస్తున్న కొద్దీ వైసీపీ జగన్ లో రాజకీయ పరిపక్వత క్షీణిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న భావాలను జగన్ నిరూపించే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. కల్తీ మద్యం తాగి అశువులు బాసిన కుటుంబాలను పరామర్శించడానికి విజయవాడ విచ్చేసిన జగన్, ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సర్కార్ పై ఫైర్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

“ఏపీలోని ప్రతి మద్యం షాపు నుండి చంద్రబాబుకు, ఆయన తనయుడికి లంచాలు అందుతున్నాయని, రాష్ట్ర ప్రజల చేత ప్రభుత్వమే మద్యాన్ని తాగిస్తోందని” ఆరోపణలు చేసారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందో లేదో తెలియదు కానీ, మరో రెండేళ్ళకో, మూడేళ్ళకో మన ప్రభుత్వం వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది… అప్పుడు పూర్తిగా మద్యపాన నిషేధం అమలు పరుస్తానని అన్నారు. ఏదో డబ్బున్నోళ్ళు, సూట్లు, బూట్లు వేసుకున్నోడు తాగేందుకు ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే మద్యం అమ్మే విధంగా చర్యలు చేపడతామని, చంద్రబాబు కూడా మద్యపానం అమలు చేసేలా అసెంబ్లీలో ఒత్తిడి చేస్తామని, ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ మారాలని అన్నారు.

వాస్తవ పరిస్థితులను గమనిస్తే… ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని మార్చేందుకు ప్రభుత్వం గత నాలుగైదు మాసాలుగా అధ్యయనం చేస్తోంది. అందుకే రెన్యూవల్ ఫీజులను ప్రతి 20 రోజులకొకసారి చెల్లించేలా చర్యలు తీసుకుంది. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ కు ఈ మాత్రం విషయం తెలియదా? ఒకవేళ తెలియకపోతే అవగాహన లేకుండా ఎందుకు వ్యాఖ్యలు చేసారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం.., ఆ తర్వాత నాలుక కరుకుచుకోవడం… ఇటీవల కాలంలో జగన్ కు పరిపాటిగా మారింది.

ఇక, చంద్రబాబుకు, ఆయన తనయుడికి ప్రతి మద్యం షాపు నుండి లంచాలు అందుతున్నాయన్న విమర్శలకు జగన్ పై పడుతున్న కౌంటర్లు కోకొల్లలు. బహుశా వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఆ విధంగా లంచాలు తీసుకుని ఉంటారు… అదే ఒరవడి ఇప్పుడు కూడా కొనసాగుతోందని భావిస్తున్నారేమోనని… సోషల్ మీడియాల వేదికలుగా జగన్ పై విమర్శల ‘సునామీ’ వస్తోంది. అలా లంచాలు తీసుకునే ఇన్ని కేసుల్లో ఇరుక్కున్నారా? అంటూ వ్యక్తమయ్యే ప్రశ్నలకు కొదవ లేదు. ఇలా ఒకటేమిటి… జగన్ ‘టంగ్ స్లిప్’తో తన ‘తేనె తుట్ట’ను తానే కదుపుకున్నట్లు అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.