రాజకీయ నాయకుల మాటలు ప్రతిపక్షం లో నుండి అధికారంలోకి రాగానే మారిపోతూ ఉంటాయి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు. ‘సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. ధరలు తగ్గుతాయి’ అంటూ సౌర విద్యుత్తు పై ప్రతిపక్షంలో ఉండగా బుద్ది జ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా పాతికేళ్ల పాటు పీపీఏలు చేసుకుంటారా అని జగన్ తనదైన శైలిలో విమర్శించారు.
అధికారంలోకి వచ్చాకా పీపీఏల రద్దు అంటూ హడావిడి చేసి కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్నారు కూడా. తాజాగా మరోసారి మాట మార్చేశారు జగన్. పాతికేళ్ళ మాట దేవుడెరుగు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఏళ్లకు పీపీఏలు చేసుకోవడం గమనార్హం. అక్కడితో అయిపోలేదు… సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టేవారికి చంద్రబాబు హయాంలో కంటే మరిన్ని రాయితీలు కల్పించడం గమనార్హం.
ఇది జగన్ అనుభవరాహిత్యం అయినా అనుకోవాలి లేదా అప్పుడు ఆడిన రాజకీయ వికృత క్రీడైనా అయ్యుండాలి అని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ఈ నిర్ణయంతో పెద్ద ఎత్తున సొమ్ములు ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా మాట తప్పను మడమ తిప్పను అని ఎప్పుడు చెప్పే జగన్ మాటలు, చేతలు అందుకు అనుగుణంగా అనిపించడం లేదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
మరోవైపు… ఈ విషయం పై పాత కంపెనీలు కోర్టులకు వెళ్లే అవకాశాలు ఉందని అంటున్నారు. ఏవైతే కొర్రీలతో తమను ఇబ్బంది పెడుతున్నారో వాటికంటే ఎక్కువ బెనిఫిట్లు కొత్త కంపెనీలకు ఇస్తున్నారు కాబట్టి తమకు న్యాయం చెయ్యాలని వారు కోర్టులను అడిగే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.