ys jagan situation after 2 yearsఅధికారంలోకి వస్తుందనుకున్న పార్టీ కాస్త ప్రతిపక్షానికే పరిమితం కావడంతో, పదవులు దక్కుతాయని వైకాపాలోకి జంప్ చేసిన వారంతా పార్టీ మారడానికి సిద్దమయ్యారనే టాక్ అప్పట్లో హల్చల్ చేసింది. సగానికి పైగా ఎమ్మెల్యేలు జగన్ ను వీడిపోవడానికి రెడీ అయ్యారని, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయ వర్గాల్లో వినపడ్డ సమాచారం. దీంతో అలెర్ట్ అయిన వైకాపా అధినేత జగన్, నాయనో, భయానో దీనిని నియంత్రించగలిగారు. కానీ, ఈ ప్రక్రియ సైలెంట్ గా సాగుతోందని, జగన్ గుండెల్లో ఎప్పుడైనా బాంబు పేలవచ్చని ప్రస్తుతం వినపడుతున్న టాక్.

ముఖ్యంగా గత కొంత కాలంగా జగన్ అనుసరిస్తున్న వైఖరితో, పార్టీ నేతలే విస్తుపోతుండడంతో ఇక వైకాపాకు గుడ్ బై చెప్పాలని యోచిస్తున్నారట. దీనికి కారణాలుగా కొందరేమో రాయలసీమ ఉద్యమాన్ని నెత్తికెత్తుకునే విధంగా వ్యవహరించాలని, మరికొందరు జగన్ విధానాలను తప్పు పట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికిప్పుడే వైకాపాకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, రాబోయే రెండేళ్ళల్లో వైసీపీ పరిస్తితి పూర్తిగా మారిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇవన్నీ ఒకెత్తు అయితే, జగన్ ఎదుర్కొనే కేసుల చిట్టాలు మరొక ఎత్తుగా పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి. జగన్ కేసుల కోసం ఇప్పటికే వారానికి ఒక రోజును కేటాయించి మరీ విచారణ జరుపుతున్నారు. దీని ప్రకారం మరో ఏడాదిలో జగన్ భవితవ్యం తేలిపోతుందని, ఆరోపణలు రుజువైతే మరోసారి కటకటాలు చూడాల్సి వస్తుందని పార్టీ వర్గాలు కూడా ఫిక్సయిపోయాయట. దీంతో ముందస్తు చర్యలుగా సేఫ్ సైడ్ లో భాగంగా ఎవరి దారులు వారు వెతుక్కొంటున్నారని రాజకీయ వర్గాల టాక్. ఏ రకంగా చూసుకున్నా రాబోయే రెండు, మూడేళ్ళు జగన్ కు, అయన పార్టీకు అత్యంత క్రియాశీలకంగా మారనుంది.