YS-jagan-friday-court-storyతన వ్యాఖ్యలతో అసెంబ్లీలో దుమారం లేపడం వైసీపీ అధినేత జగన్ కు పరిపాటిగా మారిపోయింది. తాజాగా న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా జగన్ చేసిన వ్యాఖ్యలు సభ వాతావరణాన్ని హాట్ హాట్ గా మార్చేసాయి. “తనపై ఉన్న అవినీతి కేసుల్లో ఏ కోర్టులు తనను దోషిగా ప్రకటించాయో చెప్పాలని, 43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ అధికారపక్ష సభ్యులు పదేపదే ప్రస్తావిస్తున్నారని, ఈ కేసులపై కోర్టులో విచారణ జరుగుతుండగా ఏ ఆధారంతో ఆరోపణలు చేస్తారని, మొదట్లో రెండు ఎకరాల భూమి ఉన్న చంద్రబాబునాయుడుకి, 2 లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని, చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసుకుని జడ్జిమెంట్ తెచ్చుకున్నారు, వ్యవస్థలను మేనేజ్ చేశాడు” అంటూ జగన్ న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు మండిపడ్డారు.

“జడ్జిలపై జగన్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీకి తీరని మచ్చ అని, జగన్ కు ఏ వ్యవస్థపైనా నమ్మకం లేదని, ముప్పై ఐదేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనను తానెన్నడూ చూడలేదని, న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సభ్యుల మనోభావాలను కించపరిచిన జగన్ సభకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని” ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సూచనను కూడా జగన్ పక్కన పెట్టి మరలా తను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేసారు.

“తనకు న్యాయవ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉందని, జ్యుడిషియరీ మీద గౌరవంతో ప్రతి శుక్రవారం సిబిఐ కోర్ట్ కి వెళ్తున్నానని, నా మీద కేసులు టిడిపీ పన్నిన కుట్ర అయినా నేను చట్టం మీద గౌరవంతో అందుకే వారం వారం కోర్టుకు వెళ్తున్నాననంటే, జ్యుడిషియరీ మీద నా కన్నా ఎక్కువ గౌరవం ఎవరికీ ఉండదని” అంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు పడి పడి నవ్వడం తెలుగుదేశం నేత దేవినేని ఉమా వంతయ్యింది.

“ప్రజలకు సేవ చేయడానికి వెళ్తున్నావా… కేసుల్లో ఇరుక్కుని అవినీతి చేసి వెళ్తున్నావ్… నీ దయ వల్ల అందరూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని, అన్ని వ్యవస్థలపై, కోర్టు తీర్పులపై, జడ్జిలపై జగన్ ఆరోపణలు చేయడం సబబు కాదని, ఈ వ్యాఖ్యలను జగన్ వెంటే వెనక్కి తీసుకోవాలని, రాజ్యాంగ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడిన జగన్ కు సభలో ఉండే అర్హత లేదని, ఎంత పెద్ద వారైనా నోరు జారినప్పుడు క్షమాపణలు చెప్పడం పరిపాటని” ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన విజ్ఞప్తికి సైతం జగన్ అదే విధంగా స్పందించడంతో అవిశ్వాసంపై ఓటింగ్ చేపట్టిన స్పీకర్ ముజూవాణీ ఓటింగ్ తో అవిశ్వాసం వీగిపోయింది.