YS Jagan Sankalpa Yatra Speechఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాలు చరిత్రలో నిలిచిపోవాలని సంకల్పించి, అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును అవహేళన చేస్తూ… “చంద్రబాబు ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు. ఏ సినిమా చూస్తే ఆ సినిమా సెట్స్ మాదిరి రాజధాని ఉండాలంటున్నారు” అని హేళనగా మాట్లాడిన వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యల్లో వాస్తవం పక్కన పెడితే, జగన్ ప్రసంగాలు విన్న తర్వాత… నిజంగా సినిమాలను చంద్రబాబు చూస్తున్నారా? జగన్ చూస్తున్నారా? అన్న అనుమానం కలుగక మానదు.

అవును… నేడు ప్రారంభమైన పాదయాత్రలో జగన్ చేసిన ప్రసంగంలోని డైలాగ్ లను పరిశీలిస్తే… ఏ మాత్రం సినిమా డైలాగ్ లకు తగ్గకుండా ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే… బ్యాక్ బోన్ లో ఎవరో ఒక సినీ రచయిత జగన్ కు ఈ డైలాగ్ లను రాసి ఇచ్చి ఉంటారన్న సందేహం కూడా కలుగక మానదు. అయితే జగన్ చెప్తున్న ఈ డైలాగ్ లన్నీ కూడా ‘అవుట్ డేటెడ్’ అన్న విషయం మాత్రం వైసీపీ అధినేత గమనించుకోలేకపోతున్నారు.

‘శివాజీ’ సినిమాలో రజనీకాంత్ నడిచి వస్తుంటే… బ్యాక్ గ్రౌండ్ లో తారురోడ్డు, పెద్ద పెద్ద నిర్మాణాలు ఎలా గ్రాఫిక్స్ లో వెలుస్తాయో సరిగ్గా అదే రీతిలో జగన్ వ్యాఖ్యలు ఉండడం విశేషం. తన దగ్గర కావల్సినంత కసి ఉంది, కానీ ఉండాల్సిన ఆ ఆధికారం కూడా ఉంటే… మీకు ఓ రేంజ్ లో సినిమా చూపిస్తాను అన్న రీతిలో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పరిపక్వత కలిగిన వారికి కాస్తంత ఎక్కువగానే హాస్యాన్ని పండిస్తున్నాయిలేండి. బహుశా పాత సినిమాలన్నింటిని జగన్ వరుసగా చూసేసినట్లుగా కనపడుతోంది.

అయితే ప్రస్తుత కాలం… పరుచూరి బ్రదర్స్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్ డేట్ అయ్యిందన్న అంశం ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనుకుంటున్న జగన్ వర్యులకు తెలియదేమో!