YS Jagan Sankalpa Yatra filled with kissesతెలిసి అన్నారో తెలియక అన్నారో తెలీదు గానీ మాజీ హీరో బాలచందర్ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. “ఇంత మంది జనం రావడం వారి అభిమానం సంపాదించుకోవడం మాటలు కాదు. ఇది ఒక్క జగన్ కు మాత్రమే సాధ్యం. ప్రతి అవ్వకు చెల్లికి ఏడాది పాటు అలా ముద్దులు పెట్టుకుని వెళ్ళడం మాములు విషయం కాదు. అది జగన్ గారికి ఒక్కరికే సాధ్యం. ఆయన దేవుడు పంపిన దేవదూత,” అంటూ ఆవేశంగా మీడియా తో మాట్లాడారు బాలచందర్.

గతంలో ఓదార్పుయాత్ర సందర్భంగా ఇప్పుడు పాదయాత్ర సందర్భంగా ప్రజలతో మమేకం అవుతూ జగన్ ఆప్యాయంగా ముద్దులు పెట్టడం అలవాటు. ఈ అలవాటును సోషల్ మీడియాలో చాలా మంది అవహేళన చేస్తూ ఉంటారు. అయితే క్రిస్తవ సంప్రదాయంలో నుదిటి పై ముద్దు పెట్టడం అనేది చాలా కీలకమైన చర్య అని దానికి వారు ఎంతో విలువనిస్తారని, అందుకే జగన్ అలా చేస్తుంటారని ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. ఇడుపులపాయ నుంచి నవంబర్‌ 6, 2017న మొదలయిన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ఈరోజుతో పూర్తి కాబోతుంది.

దాదాపుగా 3650 కిలోమీటర్ల పాటు జగన్ నడిచారు. జగన్‌మోహన్‌రెడ్డి 134 నియోజకవర్గాలలో పర్యటిస్తే 124 బహిరంగ సభలలో ప్రసంగించారు. ఈరోజు సాయంత్రం ఇచ్చాపురంలో జరిగే భారీ బహిరంగసభతో పాదయాత్ర పూర్తి అవుతుంది. ఆ వెంటనే జగన్‌ తిరుపతికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారని, రేపు ఉదయమే అతిథి గృహం నుంచి కారులో బయలుదేరి అలిపిరికి చేరుకుంటారని సమాచారం. శ్రీవారి మెట్టుదారిన తిరుమలకు నడిచి వెళ్లి, శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటారు.

గత సంవత్సరం పాదయాత్ర ప్రారంభించే ముందు కూడా జగన్ తిరుమల దర్శనం చేసుకున్నారు. పాదయాత్ర చేరని నియోజకవర్గాలలో బస్సు యాత్ర చెయ్యాలని మొదట సంకల్పించినా పాదయాత్ర బాగా ఆలస్యం కావడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టు సమాచారం. ఎన్నికలకు ఐదు నెలలే సమయం ఉండటంతో అభ్యర్థులు ఫైనల్ చేయ్యడంలో ఆయన కొన్ని రోజులు బిజీగా ఉండబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే మలి విడత ప్రచారం మొదలు పెడతారు.