YS Jagan review on polavaram projectవైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన మొట్టమొదటి ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టును కట్టాల్సిన అవసరం లేదని, జాతీయ ప్రాజెక్టు కనుక కేంద్రానికి తిరిగి ఇచ్చెయ్యడంలో ఎటువంటి అభ్యంతరం లేదు అన్నట్టు చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఇస్తా అన్నా ప్రాజెక్టును తిరిగి తీసుకుని కట్టే ఉద్దేశం లేనట్టు కేంద్రం సంకేతాలు పంపింది. పోలవరం అథారిటీ వారు అటువంటిది ఏమీ లేదు రాష్ట్రప్రభుత్వమే కడుతుంది అని చెప్పుకొచ్చారు.

ఇది ఇలా ఉండగా పోలవరం ప్రాజెక్టు పై రివ్యూ చేసిన జగన్ కు ఈ ప్రాజెక్టు పనులపై రాష్ట్రం ఖర్చు చేసిన రూ.4,810 కోట్ల నిధులను కేంద్రం మనకు చెల్లించాలని అధికారులు వివరించారు. ఆ నిధులను వెంటనే రాబట్టడానికి ప్రయత్నించాలని వారికి సీఎం చెప్పారు. ‘‘ కేంద్రం నిధులు విడుదల చేసేలోగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేద్దాం. ఈ ప్రాజెక్టు పూర్తిచేయడం అత్యంత ప్రాధాన్య అంశం. దానిని త్వరితగతిన పూర్తి చేయాలి,” అని జగన్ వారికి దిశానిర్దేశం చేశారు.

కేంద్రం నుండి నిధుల విడుదల ఆలస్యం అయితే సొంత నిధులతో ప్రాజెక్టును పూర్తి చెయ్యడం అనేది గతంలో చంద్రబాబు తీసుకున్న స్టాండే. జగన్ కూడా ఇప్పుడు అదే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. మొన్న ఆ మధ్య అచ్చం చంద్రబాబు చెప్పినట్టే కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది కాబట్టి స్పెషల్ స్టేటస్ విషయంలో మనం చెయ్యగలిగింది ఏమీ లేదు, వెళ్ళినప్పుడల్లా అడగడం తప్ప అని జగన్ చెప్పిన విషయం మన అందరికీ తెలిసిందే. కీలక విషయాలలో చంద్రబాబు, జగన్ ఒకే మాట మీద ఉన్నట్టున్నారు.