YS Jagan - Nagarjuna Akkineniజనవరి 10 : ఓ వైపు కరోనా పరిగెడుతోంది.రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదవుతుంటే, ఈ సినిమా వాళ్ళ గోలేంటి, ‘ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, చుట్ట కాల్చుకోవడానికి నాకు టైం ఇవ్వలేదంటే ఎట్టా?’ అన్నాడట. ‘ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్’ సినిమాల మాదిరే మిగిలిన చిత్రాలు కూడా వాయిదా వేసుకోవచ్చు కదా అని సీరియస్ గా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మీడియా ముఖంగా ప్రకటించారు.

జనవరి 11 : ఓమిక్రాన్ విజృంభిస్తోందని కరోనా ఆంక్షలను అమలులోకి తెచ్చిన ఏపీ సర్కార్, ఉన్నట్లుండి ఈ నిబంధనలను ఎత్తివేసింది. పండగ వేళల్లో ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తారు గనుక ఈ నెల 18వ తేదీ నుండి ఈ ఆంక్షలు ఉంటాయని తాత్కాలికంగా బ్రేకులు వేసింది. అయితే దీని వెనుక అసలు ఆంతర్యం వేరే ఉందన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.

ఏపీలో టికెట్ ధరలపై తనకేమి ఇబ్బంది లేదని బహిరంగ వేదికపై నాగార్జున మాట్లాడి, పరోక్షంగా జగన్ నిర్ణయానికి ‘జై’ కొట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ హీరోలలో ఏపీ సర్కార్ నిర్ణయం పట్ల మద్దతు తెలిపిన ఏకైక హీరోగా నాగ్ నిలిచారు. దీంతో నాగ్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే క్రమంలోనే ఏపీలో ఆంక్షలను సడలించినట్లుగా లేటెస్ట్ వచ్చిన టాక్.

సంక్రాంతికి “బంగార్రాజు” తప్ప మరో పెద్ద సినిమా రిలీజ్ కు నోచుకోకపోవడంతో, జగన్ సర్కార్ కు పని సులభం అయ్యిందనేది దీని సారాంశం. కరోనా ఆంక్షలు అమలు పరిస్తే ధియేటర్లలో 50% మాత్రమే ఆక్యుపెన్సీ ఉండాలి, వాటిని ఇప్పుడు సడలించడంతో 100% టికెట్లను మంజూరు చేయవచ్చు. ఏపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితులు నెలకొన్నట్లుగా కనపడుతోంది.

పండగ నాలుగు రోజులు 100 శాతం ఆక్యుపెన్సీ హౌస్ ఫుల్స్ తో కళకళలాడినా “బంగార్రాజు” కొంత ఒడ్డున పడ్డట్టే! అందువలనే పండగ తర్వాత జగన్ కరోనా ఆంక్షలను అమలులోకి తీసుకువస్తున్నారా? నాగ్ – జగన్ కు ఉన్న అనుబంధం రీత్యా టికెట్ ధరల విషయంలో కూడా చూసి చూడనట్లు ఊరుకుంటారా? అన్న టాక్ కూడా పొలిటికల్ అండ్ సినీ వర్గాలలో వినపడుతోంది.