YS Jagan Responds 500 and 1000 rupee note demonetisationమోడీ ప్రకటించి దాదాపుగా రెండు వారాలు గడుస్తున్న ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయంపై ఎట్టకేలకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పెదవి విప్పారు. అయితే అందరూ ఊహించిన విధంగానే మోడీ నిర్ణయాన్ని స్వాగతించే అభిప్రాయాన్ని జగన్ వ్యక్తపరచలేదు. “పెద్ద నోట్ల రద్దుతో ఎవ్వరూ సంతోషంగా లేరని” తన అభిప్రాయాన్ని కాస్త జనరలైజ్ చేసి విశదీకరించారు. అలాగే ఈ నోట్ల రద్దు కూడా చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ వ్యాఖ్యానించడం జగన్ “ఆలోచనలకు” అద్దం పడుతోంది.

“ఓట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసనీ, అందుకని వారంతా ముందే తమ నల్లధనాన్ని సర్దేసుకున్నారని, ఇది సరికాదని, అందరినీ సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్న” అభిప్రాయాన్ని జగన్ వ్యక్తపరిచారు. ఒక విధంగా ఈ సమాచారం తమకు తెలియకపోవడంతో తమ లాంటి వారమంతా అన్యాయమైపోయామనే భావన, ఆవేదన జగన్ వ్యాఖ్యల్లో వ్యక్తం కావడం విశేషం. ఇంతకుముందు వైసీపీ నేతలు రోజా, అంబటి రాంబాబులు చేసిన వ్యాఖ్యలనే కాస్త అటు ఇటుగా జగన్ వ్యక్తపరిచారు.

అయితే తానూ చేసిన ఈ వ్యాఖ్యల అంతరార్ధం గమనించుకున్న జగన్, ఆ తర్వాత కాస్త సరిదిద్దుకునే ప్రయత్నం చేసి, ప్రజల సమస్యలను ప్రతిబింభించే ప్రయత్నం చేసారు. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ప్రజలు పడుతున్న కష్టాలు అగమ్యగోచరంగా మారాయని, ముందస్తు చర్యలు తీసుకోవడం ఆర్బీఐ అధికారులు విఫలమయ్యారని కవర్ చేసుకునే ప్రయత్నం చేసారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దుపై తన ఆవేదనను బయటపెట్టడంలో జగన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.