YS Jagan -Raithu Barosa‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. రైతు కుటుంబాలకు తొలి విడత రూ.7,500 సాయం అందిస్తున్నామని సీఎం ప్రకటించారు. వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం చేస్తున్నామన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా 49.43 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని జగన్‌ తెలిపారు.

దీని కోసం ప్రభుత్వం 2,800 కోట్లు విడుదల చేసింది. ఈ సందర్భంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ… అప్పులతో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. సాధారణ పరిస్థితులు ఉంటే రైతులతో కలిసి ఒక పెద్ద సభలో ఈ కార్యక్రమం నిర్వహించి ఉండేవాళ్లం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించడం బాధగా ఉందన్నారు.

అంతవరకు బాగానే ఉంది. “ఐదేళ్లలో రైతన్నలకు రూ.67,500 ఇస్తున్నాం. మాకు ఓటు వేయని రైతులకు కూడా సాయం ఇస్తున్నాం. అది మా ప్రభుత్వం గొప్పతనం” అని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. అయితే దీనిని చాలా మంది తప్పు పడుతున్నారు.

“మాకు ఓటు వెయ్యని వారికి కూడా సాయం చేస్తున్నాం అనడం ఏంటి? జగన్ ఏమన్నా తన సొంత డబ్బు ఇస్తున్నారా? లేక తమ పార్టీ డబ్బు ఇస్తున్నారా? ఓటు వేసిన వారికీ ఓటు వెయ్యని వారికి కూడా జగన్ ముఖ్యమంత్రే. పైగా ఇస్తున్నదని ప్రజలందరి డబ్బే. బాధ్యతని ఘనకార్యంగా చెప్పుకోవడం తప్పు,” అని వారు ఆక్షేపిస్తున్నారు.