పార్లమెంట్ లో జగన్ పరువు పాయే!ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో మా రాష్ట్రం ఉందని చెప్పుకోవడం ఎంతటి అవమానకరం!? అది కూడా పార్లమెంట్ వేదికగా వెల్లడిస్తే… దేశమంతటా అది ప్రచారం పొందుతుంది. తాజాగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అదే చేసారు.

రాజమండ్రి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన భరత్, తాజాగా జరుగుతోన్న పార్లమెంట్ సమావేశాలలో ఏపీ యొక్క దుస్థితి గురించి వెల్లడించారు. మా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉందని, కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని వెల్లడించారు.

సింపతీ వర్కౌట్ అయ్యి, కేంద్రం కనికరిస్తుందని చెప్పారో లేక నిజంగానే రాష్ట్ర దయనీయ పరిస్థితిని దేశం ముందుంచాలని చెప్పారో గానీ, భరత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో ముఖ్యమంత్రిగా జగన్ పరువు పోయిందంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ఇటీవల వెల్లడైన ఓ సర్వేలోని ఒక్క పాయింట్ ను పట్టుకుని, దేశంలోనే 6వ స్థానంలో ఏపీ ఉందంటూ వైసీపీ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేసాయి. మరి అంతలా అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతోందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

సంక్షేమం పేరుతో అంచనాలకు మించిన భారం… పరిపాలనా అనుభవ రాహిత్యం… రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరడం… వంటి అంశాలే నేడు ఏపీ ఈ దుస్థితిలో ఉండడానికి కారణమని ఇటీవల ఉండవల్లి లాంటి ప్రముఖులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఇది జగన్ యొక్క పనితీరుకు నిదర్శనంగా నాడు పేర్కొనడంతో, నేడు ఎంపీ భరత్ అదే స్థాయిని పార్లమెంట్ వేదికగా బయటపెట్టారు.