Jagan Reddy -Cabinet-Meeting.jpgఇటీవల సిఎం జగన్‌, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దలను కలిసి రావడంతో ఏపీలో ముందస్తు ఎన్నికల పొత్తుల కోసమే అని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఈరోజు సిఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముందస్తుకు వెళ్ళడం లేదని స్పష్టం చేశారు. కానీ తొమ్మిది నెలల్లో జరుగబోయే ఎన్నికలకు పార్టీలో అందరూ సిద్దంగా ఉండాలని చెప్పారు.

నిజానికి ఏ పార్టీనైనా 5 ఏళ్ళు పాలించమనే ప్రజలు ఎన్నుకొంటారు. కానీ కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ముందస్తుకు వెళుతుంటాయి. అలాగని ముందస్తుకు వెళ్ళినంతమాత్రాన్న తప్పకుండా గెలుస్తామనే గ్యారెంటీ ఉండదు. ఇందుకు టిడిపి ఉదాహరణ అనుకొంటే, గెలిచే అవకాశం కూడా ఉందని చెప్పడానికి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉంది.

ఏది ఏమైనప్పటికీ, సిఎం జగన్‌ ముందస్తు వద్దనుకొన్నారు కనుక దాని కోసం ఆశగా ఎదురుచూస్తున్న టిడిపి, జనసేనలకు కాస్త నిరాశ కలుగుతుంది. కానీ ఇదీ ఒకందుకు మంచిదే. నాలుగేళ్ళు జగన్‌ పాలన రుచి చూసిన ఆంధ్రా ప్రజలు, మరికాస్త రుచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే వారు ‘సెకండ్ ఛాన్స్’ ఇస్తే ఎలా ఉంటుందో అర్దం చేసుకోగలుగుతారు. ఈలోగా ఏపీలో రాజకీయ, సామాజిక సమీకరణలలో కూడా చాలా మార్పులు వస్తాయి. కనుక టిడిపి, జనసేనలకు మేలే కలుగుతుంది.

సంక్షేమ పధకాలు మెడకు గుదిబండలా మారుతున్నప్పటికీ అంతవరకు జగన్ ప్రభుత్వం యదాతధంగా కొనసాగించక తప్పదు. అది సాధ్యమా కాదా అనేది జగన్ ప్రభుత్వానికే తెలియాలి. కనుక మరో 9 నెలల తర్వాత ఎన్నికలకు వెళితే, బహుశః వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మునిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కానీ పూర్తిగా మునిగాకే ఎన్నికలకు వెళ్దాం అంటున్నారంటే బహుశః మళ్ళీ గెలిచి అధికారంలోకి రాలేకపోవచ్చుననే అనుమానం కూడా ఉండి ఉండవచ్చు!

అయితే తమ సంక్షేమ పధకాలకు ధీటుగా చంద్రబాబు నాయుడు కూడా పధకాలు ప్రకటించడంతో జగనన్న కంగు తిన్నందునే ముందస్తు ఆలోచన విరమించుకొన్నారని టిడిపి నేతలు వాదిస్తున్నారు. బహుశః అదీ నిజమే అయ్యుండవచ్చు.