YS Jagan reconstructing demolished 9 temples in vijayawadaఏపీలో వరుసగా జరుగుతున్న దేవాలయాల మీద దాడుల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం చాలానే కష్టపడుతుంది. ఉన్నఫళంగా ముఖ్యమంత్రి విజయవాడలో పుష్కరాల సమయంలో తొలగించిన గుడులకు శంకుస్థాపన చేశారు. మరోవైపు… ప్రభుత్వం మత సామరస్య కమిటిలు అంటూ కొత్తగా కమిటీల నియామకం ప్రకటించింది.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక కమిటీ వేస్తారంట. ఇందులో ప్రతి మతానికి చెందిన ఒకరు సభ్యులుగా ఉంటారట. ఈ కమిటీలన్నిటికీ చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా ఉంటారు. డీజీపీ వైస్-చైర్మన్ గా అలాగే జిల్లాలలో కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాల కమిటీలకు ఇంఛార్జిలుగా ఉంటారట. ఈ కమిటీలు మత సామరస్యం కోసం చర్యలు తీసుకుంటాయంట.

వినడానికి బానే ఉంది. అయితే ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది అర్ధం కాకుండా ఉంది. దేవాలయాల మీద వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏదో చేసేస్తోంది అని చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికి వస్తాయో తెలీదు. మహా అయితే మరికొందరు రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కలుగుతుంది.

దేవాలయాల మీద వరుస దాడులు ఆగాలంటే పోలీసు వ్యవస్థ పటిష్టంగా పని చెయ్యాలి… దేవాలయాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చెయ్యాలి.. అటువంటి కేసులను త్వరగా పరీక్షించి దోషులను శిక్షిస్తే మిగతావారికి భయం కలిగి బుద్దిగా ఉంటారు… అటువంటి చర్యలు చేపడితే మత సామరస్యం ఆటోమేటిక్ గా వెల్లివిరుస్తుంది.