YS-Jagan-Rajam-YSRCP-“గత ప్రభుత్వం చేయలేనివి మనం చాలా చేశాం. ఇంకా చేస్తూనే ఉంటాం. మనం ఎన్నికల హామీలలో 85 శాతం అమలుచేశాం. డైరెక్ట్ బెనిఫిట్ విధానంలో నేరుగా ప్రతీ అక్క, చెల్లెమ్మ ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. ఇప్పుడు మీరు చేయవలసినదల్లా ఒక్కటే. ప్రజలలోకి వెళ్ళి మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి ప్రచారం చేసుకొని మనం చేసిన మంచిని ఓట్ల రూపంలోకి మార్చుకొంటే చాలు. ప్రజల ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది. మనం చేస్తున్న మంచిపనులు చూసి ప్రజలు మనమే మరో ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండాలని కోరుకొంటున్నారు.” సిఎం జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో రాజాం నియోజకవర్గం ప్రజాప్రతినిధులతో భేటీ అయినప్పుడు చెప్పిన మాటలవి.

సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో సౌమ్యంగా చెప్పిన ఈ మాటలు ఎంతో వినసొంపుగా ఉన్నాయి. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఆయన చెప్పినదానికి చాలా భిన్నంగా ఉన్నాయని గడప గడపకి కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుభవపూర్వకంగా తెలుసుకొంటున్నారు.

గడప గడపకి ఎదురవుతున్న ఛీత్కారాలు, నిలదీతలు, మహిళల తిట్లు శాపనార్ధాలను ఎల్లో మీడియా సృష్టిగా చెప్పి తప్పించుకొంటున్నప్పటికీ, ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్న వారికి వాస్తవ పరిస్థితి ఏమిటో అర్దమవుతోంది. అందుకే గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళమని సిఎం జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెపుతున్నా జంకుతున్నారు.

కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకొని మరో ముప్పై ఏళ్ళు తానే రాష్ట్రాన్ని పాలించాలనే భ్రమలో ఉన్నట్లు కనిపిస్తోంది.

‘మనం చేస్తున్న మంచిని ఓట్లుగా మార్చుకోవాలని’ చెప్పడం ద్వారా ఓట్ల కోసమే మూడేళ్ళుగా సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని స్పష్టమవుతోంది. ఎన్నికల సమయంలో తాయిలాలు పంచే పద్దతిని అధికారంలోకి రాగానే మొదలుపెట్టేసి మూడేళ్ళుగా పంచుతూనే ఉన్నారు. ఇన్ని సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నా ఇంకా లోన ఏదో భయం, అభద్రతాభావం అందుకే ఎన్నికలకీ ఇంకా రెండేళ్ళు ఉండగానే గడప గడపకి మంత్రులు, ఎమ్మెల్యేలను పరుగులు తీయిస్తున్నారని చెప్పవచ్చు.

కేవలం మూడేళ్ళలోనే లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్ ప్రభుత్వం ఒకవేళ ముప్పై ఏళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తే ఎన్ని కోట్ల కోట్లు అప్పులు చేస్తుందో ఏ కంప్యూటరుతో లెక్కగట్టలేము.