YS jagan Raithu deekshaఅధికార ప్రభుత్వంపై నిరసన తెలియజేయడానికో లేక తన పార్టీ మనుగడ కోసమో లేక మీడియాలో తన పేరు, పార్టీ పేరు ప్రముఖంగా రావడం కోసమో గానీ… గత కొన్ని సంవత్సరాలుగా జగన్ ఎంచుకున్న ఏకైక అస్త్రం… దీక్షలు చేయడం. సమస్య ఏదైనా… సొల్యూషన్ ఒక్కటే… అనే విధంగా… అన్ని సమస్యలకు దీక్షలతో సమాధానం చెప్పడం జగన్ రాజకీయ వ్యూహంగా కనపడుతోంది. సమస్యకున్న పరిధిని బట్టి, అది ఒక రోజు దీక్షో లేక రెండు రోజుల దీక్షో అన్న విషయం ఖరారవుతుంది.

అయితే ఈ దీక్షలు చేసే విషయంలో మాత్రం జగన్ అనుసరిస్తున్న విధానం… యువనేత తెలివితేటలను ప్రతిబింబిస్తోందని చెప్పవచ్చు. నిరాహార దీక్ష అని చెప్పే జగన్… ఉదయం 11 నుండి 12 గంటల నడుమ దీక్షను ప్రారంభిస్తారు. ఒక రోజు దీక్ష అయితే అది సాయంత్రం నాలుగైదు గంటల సమయానికి ముగిసిపోతుంది. అదే రెండు రోజుల దీక్ష అయితే మరుసటి రోజు సాయంత్రం మూడు, నాలుగింటికి ముగిసేలా ప్లాన్ చేస్తారు. ఇక్కడే వైసీపీ అధినేత చాకచక్యం, చాతుర్యం బహిర్గతమవుతున్నాయి.

దాదాపుగా 24 నుండి 28 గంటల వరకు చేసే దీక్షకు రెండు రోజుల దీక్ష అని, ఓ అయిదారు గంటలు చేసే దీక్షకు ఒక రోజు దీక్షగా జగన్ నామకరణం చేసారు. ఇక్కడ చెప్పాల్సిన మరొక విషయం ఏమిటంటే… సాయంత్రం నాలుగింటికి ముగించే సమయంలో… సమయాభావన నింద ప్రభుత్వం పైనే వేస్తారు. తమకు 4 గంటల వరకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అందుకే ఇంత త్వరగా దీక్ష ముగించేయాల్సి వచ్చిందని ముగింపు ప్రసంగంలో, ఈ అంశంతో ప్రభుత్వంపై మరో నాలుగు రాళ్లు ఎక్కువ వేస్తారు.

ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒంటపట్టని ఈ రకమైన తెలివితేటలను జగన్ అనతి కాలంలోనే సొంతం చేసుకోవడం విశేషం. పేరుకు రెండు రోజులైనా, జగన్ దీక్షలో ఉండేది సరిగ్గా 24 నుండి 28 గంటలు మాత్రమే. చెప్పుకోవడానికి గ్రాండ్ గా రెండు రోజులు… చేసేది మాత్రం ఒక రోజు..! సరే ఎన్ని గంటలు చేసినా… చేకూరే ప్రయోజనం ఏంటి..? అన్న ప్రశ్న మాత్రం ఎవరికీ రాకూడదు సుమీ..!