YS Jagan Quit AP dialogue misfiresనంద్యాల ఉప ఎన్నికల సమరంలో గెలవాలన్న తాపత్రయంతో సర్వశక్తులు ఒడ్డుతున్న వైసీపీ అధినేత జగన్, సినీ డైలాగ్ లను సంధిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న వైనం తెలిసిందే. ఇందులో భాగంగా అసలు తాను ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనంత ఆవేశంలో ప్రసంగిస్తున్నారన్న విషయం అర్ధమవుతోంది. ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ ‘క్విట్ ఏపీ’ అన్న పిలుపునిచ్చిన జగన్ వ్యాఖ్యలకు విమర్శలతో పాటు కౌంటర్లు, ఎన్ కౌంటర్లు, సెటైర్లు తుఫాన్ లా వచ్చిపడుతున్నాయి.

వైసీపీ అధినేత అసలు ‘క్విట్ ఏపీ’ అనడానికి అర్హత ఎక్కడుంది? అసలు ఆయన ఏపీలో ఉంటేనే కదా… క్విట్ అవ్వడానికి..! కేసుల నిమిత్తం ఎప్పుడూ హైదరాబాద్ లో సంచరిస్తున్న జగన్, ఇలా ఎప్పుడో తనకు రాజకీయ లబ్ది కోసం ఏపీని ఓ టూరిస్ట్ లా చూసి వెళ్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతుండగా, జగన్ ఇచ్చిన ‘క్విట్ ఏపీ’ అన్న నినాదానికి వినూత్నంగా టిడిపి వర్గీయులు ‘జై’ కొడుతున్నారు. నమ్మశక్యం కాకపోయినా… ఇది నిజం. ఇటీవల జగన్ ఇచ్చిన ‘క్విట్ ఏపీ’ అన్న నినాదం సరైనదే అన్న భావనను టిడిపి వర్గీయులు వ్యక్తపరుస్తున్నారు.

అయితే ప్రజలంతా ఆ నినాదం అందుకోవాల్సిన అవసరం లేదు, ఒక్క జగన్ ‘క్విట్ ఏపీ’ అంటే చాలు… రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పుల్లలు వేసేవారు ఉండరు… అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నారు. ఏపీకి సంజీవని లాంటిది అయిన పోలవరంను అడ్డుకోవాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు మరియు పట్టిసీమను వ్యతిరేకించడం, అలాగే రాజధాని అమరావతి నిర్మాణాలను ఏ విధంగా అయినా ఆపుదల చేయించాలని చేస్తున్న ప్రయత్నాలతో విసిగిపోయి ఉన్న అధికార పార్టీ వర్గీయులు, జగన్ నిజంగా ‘క్విట్ ఏపీ’ కావాలని ఉద్యమిస్తున్నారు.

తాను చేసిన వ్యాఖ్యలు చివరికి తనకే ‘బూమ్ రాంగ్’ అవ్వడం బహుశా జగన్ కు కొత్తేమీ కాకపోయినా, ప్రతిసారి రిపీట్ కావడం మాత్రం ఒక్క జగన్ విషయంలోనే జరుగుతుందని చెప్పాలి. బహుశా ఇదే జగన్ స్పెషాలిటీ ఏమో! జగన్ వ్యవహార తీరుతో మున్ముందు ‘క్విట్ ఏపీ’ అంటూ జగన్ వెంటపడడం అధికార పార్టీ నాయకుల వంతవుతుందేమో చూడాలి! ఏదైనా జగన్ కేక… తన పైన అవినీతి మరకలు ఉంచుకుని, టిడిపి నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఎలా డిఫెన్స్ లో పడ్డారో, ప్రస్తుతం ‘క్విట్ ఏపీ’ విషయంలో కూడా అంతే డిఫెన్స్ లో పడ్డారు ఈ ‘యువనేత.’