YS Jagan Publicity - Vijaya Sai Reddyరాజకీయాలలో ఉన్నపుడు ఆచితూచి మట్లాడాలంటారు. ఎందుకంటే నేడు మనం చేసే విమర్శలు గానీ, మాటలు గానీ ఏదొక రోజు తిరిగి మనల్నే వెంటాడుతుంటాయి. ప్రతి రాజకీయ నేత ఇలాంటి అనుభవాలు చవిచూడడం సహజమే గానీ, కాలం గడుస్తున్న కొద్దీ ఈ అనుభూతులు సంఖ్య ఎక్కువవుతుండడం మాత్రం అందరి రాజకీయ నేతలకు సాధ్యం కాదు.

ఈ విభాగంలో వైసీపీ నేతల నడుమ మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. గత తెలుగుదేశం ప్రభుత్వంపై చేసిన విమర్శలను, ప్రస్తుత పాలన ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ, ఇప్పటికే అనేక వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. అంటే సొంత పాలనపై ఆ పార్టీ నేతలే విమర్శలు చేసే విధంగా ఈ వీడియోలను రూపొందించి టీడీపీ వర్గీయులు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసారు.

ఇదిలా ఉంటే చంద్రబాబును పరోక్షంగా దుయ్యబడుతూ, జగన్ సర్కార్ తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ గతంలో విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేసారు. “జగన్ గారు పబ్లిసిటీ కోసం పని చేయడం ఇష్టపడరు. ప్రజల కోసం శ్రమించడమే తెలుసాయనకు. ఎంత పెద్ద కార్యక్రమమైనా ఫుల్ పేజీ యాడ్స్ కనపడవు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పుకోవడం కూడా నచ్చదు. చేయనిదానికి క్రెడిట్ కొట్టేయాలని చూడడం బాబు బలహీనత, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే జగన్ గారి బలం” అంటూ ఓ రెండేళ్ల క్రితం ట్వీట్ చేసారు.

కట్ చేస్తే… ఆంధ్రజ్యోతి మినహా ఏ పేపర్ తిలకించినా మొదటగా జగన్ గారి ముఖచిత్రాలే దర్శనమిస్తున్నాయి. ఫుల్ పేజీతో కూడిన యాడ్స్ ను ఇవ్వడంలో జగన్ సర్కార్ ఎంత శ్రద్ధ చూపుతుందో అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నాడు సాయిరెడ్డి చెప్పిన దానికి, ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చేస్తోన్న దానికి ఎక్కడా పొంతన లేకుండా పోతోంది. దీనిని బట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేది ఎవరో ప్రజలకు తెలియాలి అంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయ పడుతున్నారు.

ఒక్క పబ్లిసిటీ విషయంలోనే కాదు, ఎన్నికలకు ముందు వైసీపీ చెప్పిన అజెండాకు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చేస్తోన్న పాలనకు ఎక్కడా పొంతన లేదనేది రాజకీయ విశ్లేషకుల భావన కూడా! ప్రత్యర్థి వర్గాలను విమర్శించడంలో ఉన్న శ్రద్ధ, సొంత పాలనపై లేదని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా పేర్కొంటున్నారు.
YS Jagan