YS Jagan Praja Darbar ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజాదర్బార్ ను ఈరోజు నుండి మొదలు పెట్టాల్సి ఉండగా తాజాగా దానిని ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆరంభించాలని నిర్ణయించుకున్నారు. జూలై ఒకటి నుంచి దీనిని మొదలు పెట్టాలని అనుకున్నా, కార్యాలయం ఏర్పాటు, వివిద పనులు పూర్తి కాకపోవడం తో నెల రోజులు వాయిదా వేశారు. దీనికి తోడు బడ్జెట్‌ సమావేశాలు ఉండడంతో ఇవన్నీ పూర్తయ్యాక జరపాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేసింది.

చివరి నిముషంలో వాయిదా పడటంతో రాష్ట్రంలోని వివాద చోట్ల నుండి ఇప్పటికే అమరావతి చేరుకున్న వారు ఇబ్బంది పడ్డారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఆమోదం పొందిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఎన్నికల కోడ్ పేరుతో చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆపేశారు. వారు తమ గోడు ముఖ్యమంత్రికి చెప్పుకోవడానికి అమరావతి వచ్చారు. వారు నిరాశతో వెనుతిరిగారు. ఇది ఇలా ఉండగా గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ప్రజా దర్బార్ నిర్వహించేవారు.

ఇప్పుడు అదే మాదిరి జగన్ కూడా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారాలు చూపే ప్రయత్నం చేయనున్నారు. ఇది ఇలా ఉండగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా నెల రోజులు పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలను బట్టి నవరత్నాల అమలు, గత ప్రభుత్వంలో ఏమైనా పొరపాట్లు జరిగాయా అనేదానిపైనే జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.