ys jagan power in hands chandrababu naidu for opportunities     జగన్ ప్రభుత్వం తమ సంక్షేమ పధకాల గురించి ప్రచారం చేసుకొనేందుకు గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమం చేపడితే, జగన్ ప్రభుత్వం ప్రజలను ఏవిదంగా పట్టి పీడిస్తోందో తెలియజేసేందుకు టిడిపి బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం చేపట్టింది.

జగన్ ప్రభుత్వం సంక్షేమ పధకాలు ఇస్తున్నప్పటికీ అందరికీ ఈయలేదు. ఇస్తున్నవారి భారం కూడా తగ్గించుకొనేందుకు సవాలక్ష నిబందనలు విధిస్తోంది. పైగా కొన్ని పధకాలలో సొమ్ము కోసుకొని చేతిలో పెడుతోంది. మరో పక్క ఎడాపెడా అప్పులు చేస్తూ ప్రజలపై ఆ భారం కూడా చెత్తపన్ను, ఇంటిపన్ను, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచేసి ప్రజలపైనే పెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. భారీ వర్షాలకు ఉభయగోదావరి జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునగడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇన్ని సమస్యలు కళ్లెదుట కనిపిస్తుంటే సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం మన పాలన మహాద్భుతంగా ఉందని, మన సంక్షేమ పధకాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని గట్టిగా నమ్ముతూ మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా నమ్మమని ఒత్తిడి చేస్తున్నారు. గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలో అందరూ ఖచ్చితంగా పాల్గొని ప్రజల మద్యకు వెళ్ళాల్సిందే లేకుంటే వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వనని మొహం మీదనే చెపుతున్నారు.

అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలకు వాస్తవ పరిస్థితులు తెలిసి ఉన్నా అధినేతకు అవన్నీ వివరించలేరు. అటువంటి ప్రయత్నం చేస్తే ఎదురుచెపుతున్నట్లుగా లేదా అసమర్దుడిగా ముద్రవేసి బయటకు సాగనంపడం ఖాయం. అయితే ప్రజా సమస్యలను గుర్తించిన టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం జోరుగా నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తోంది. దీంతో గడప గడపకి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు వెళ్ళి సంక్షేమ పధకాల గురించి చెప్పబోతుంటే ప్రజలు వారిని ఎదురు ప్రశ్నిస్తూ నిలదీస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న ప్రాంతాలలో ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు గడప గడపకి వెళ్ళేందుకు భయపడుతున్నారు. కానీ వెళ్లకపోతే టికెట్లు ఇవ్వనని జగన్ బెదిరిస్తుండటంతో వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది.

కనుక ఈ గడప గడపకి కార్యక్రమమే వైసీపీ కొంపముంచినా ఆశ్చర్యం లేదు. ఇటు అధినేత బెదిరింపులు, అటు ప్రజాగ్రహం చవి చూస్తున్న వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన, అభద్రతాభావంలో ఉన్నందున రాబోయే రోజుల్లో వైసీపీ గడప దాటేసి ఇతర పార్టీలలో చేరిపోవచ్చు.

జగన్ ప్రభుత్వానికి ప్రజలెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగల అవకాశం ఉంది కానీ వాటి కంటే సంక్షేమ పధకాల ప్రచారమే మిన్న అని భావిస్తూ తప్పటడుగు వేస్తోంది. ప్రస్తుతం టిడిపి ప్రతిపక్షంలో ఉన్నందున ప్రజా సమస్యలను స్వయంగా పరిష్కరించలేకపోవచ్చు కానీ కష్టకాలంలో ప్రజల పక్కన నిలబడి వారి ఆదరణ పొందుతోంది. చంద్రబాబు నాయుడు నిన్న, మొన్న లంకగ్రామాలలో పర్యటించడమే ఇందుకు తాజా నిదర్శనం.

కనుక అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేక జగన్ నష్టపోతుంటే, సమస్యలనే అవకాశాలుగా మలుచుకొని చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు.