Chandrababu Naidu- visiting flood areas in vijayawada-పోలవరం ప్రాజెక్టులోని హైడల్ పవన్ ప్రాజెక్టు టెండర్ ను రద్దు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాసేపటి క్రితం నిలుపుదల చేసింది. ఎపి జెన్ కో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది. హైడల్ ప్రాజెక్టు విషయంలో టెండరింగ్ లో ముందుకు వెళ్లవద్దని ఎపి హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఎపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని ఆయన ప్రశ్నించారు.

ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేదంటే రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు. లేని అవినీతిని నిరూపించాలని చూశారన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌ వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదని విమర్శించారు.

ఈ కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్టు అయ్యింది. దీంతో పోలవరం పనులు నవయుగ సంస్థనే కొనసాగిస్తారా లేక ప్రభుత్వం పట్టు విడవకుండా సుప్రీం కోర్టు తలుపు తడతారా అనేది చూడాలి. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే కోర్టు తీర్పుపై అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. ఆయన వచ్చిన తరువాత దీనిపై మరింత సమగ్రంగా చర్చించి తదుపరి చర్యలపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారులు చెబుతున్నారు.