YS Jaganవైఎస్సార్ కాంగ్రెస్ అనుబంధ మీడియా మాటలు భలే చిత్రంగా ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్ ని ఇంద్రుడు చంద్రుడు అని కీర్తించే క్రమంలో చాలా సార్లు లాజిక్ మిస్ అవుతూ ఉంటారు. తాజాగా అటువంటి ఒక మీడియా పోలవరం ప్రాజెక్టు గురించి ఒక కథనం ప్రచురించింది. టీడీపీ హయాంలోకంటే.. వైసీపీ వచ్చాకే పనుల్లో వేగం పెరిగినట్టు చెప్పుకొచ్చింది.

“చంద్రబాబు ఐదేళ్ళలో నిర్మించిన ప్రాజెక్టుకన్నా జగన్ ప్రభుత్వం గత 10 నెలల్లో ఎక్కువ వర్క్ చేసింది. రాత్రీ పగలు తేడా లేకుండా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ శరవేగంతో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తోంది,” అంటూ ఒక పెద్ద కథనం రాసింది. పోలవరం పనులు దాదాపుగా 70% పూర్తి అయ్యాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోనూ… ముఖ్యమంత్రి సమక్షంలో అధికారులు చెప్పడం మనకు తెలుసు.

70% పూర్తి అయిన ప్రాజెక్ట్ లో దాదాపుగా 40-50% పనులు చంద్రబాబు హయాంలో అయినవే. ఎందుకంటే వైఎస్ హయాంలో కాలువలు మాత్రమే తవ్విన సంగతి తెలిసిందే. ఒకవేళ 40% మాత్రమే చంద్రబాబు చేశారు అనుకున్నా… ఆ కథనం ప్రకారం ఈ ఏడాదిన్నర కాలంలో అంతకంటే ఎక్కువ పనులే జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది.

అంటే అదొక 70% ఇదొక 40% అంటే పోలవరం ప్రాజెక్టు పనులు 110% పూర్తి అయిపోయాయి. ఇక జగన్ ప్రభుత్వం నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు? ఏదో ఒకటి చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారు… ఏది నిజమో ఏది అబద్దమో కూడా తెలుసుకోలేరు అని అధికార పక్ష మీడియా అనుకుంటుందా?