Polavaram ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగిపోయిన రెండు అతిపెద్ద ప్రాజెక్టులు అమరావతి, పోలవరం. అమరావతిపై కులం, టిడిపి ముద్రలు వేసి పక్కన పడేస్తే, పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిపోయిందంటూ నిలిపివేసింది జగన్ ప్రభుత్వం. పోలవరంలో నుంచి అవినీతిని వడపోసి తీసేస్తానంటూ రివర్స్ టెండరింగ్ పేరుతో పనులన్నీ నిలిపివేయించింది.

ఆ తర్వాత అన్నీ మాట్లాడుకొన్నాక నత్తనడకన పనులు మొదలుపెట్టిన కొద్దిరోజులకే కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిందంటూ చేతులెత్తేశారు మంత్రి అంబటి రాంబాబు. కనుక ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో తెలీదని చెప్పేశారు. దాని నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.20 వేల కోట్లు కేంద్రం విడుదల చేస్తే ఇస్తామని చెప్పడానికి ఓసారి అక్కడకు వెళ్లిన్నట్లు గుర్తు!

ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు గురించి సిఎం జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబుతో సహా వైసీపీలో ఎవరూ మాట్లాడలేదు. కనీసం అటువైపు తొంగిచూసిన దాఖలాలు లేవు.

కానీ ఎన్నికల కోసం పోలవరానికే కాదు అమరావతికి వెళ్ళాల్సిన వచ్చినా వెళ్ళకతప్పదు. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోలవరం ప్రాజెక్టుని హెలికాఫ్టర్‌లో నుంచి పరిశీలించి, తర్వాత కిందకు దిగి ఫోటో ఎగ్జిబిషన్ చూసి వచ్చారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పూర్తికాదు కానీ, “పోలవరం ప్రాజెక్టు పనులపై సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారులతో ప్రాజెక్టు వద్ద సమీక్షా సమావేశం” అని అన్ని న్యూస్ పేపర్లలో వార్తలు మాత్రం వచ్చాయి.

అనాడూ అమరావతి ఫోటోలు, వీడియోలు టిడిపి ప్రభుత్వం విడుదల చేస్తే ‘అంతా గ్రాఫిక్స్’ అంటూ కొట్టిపడేశారు వైసీపీ నేతలు వారి ఆత్మసాక్షి. కానీ నేడు అదే ఆత్మసాక్షిలో పోలవరం ప్రాజెక్టు ఫోటోలు పెట్టి మహాద్భుతం అని ప్రశంశలు కురిపించింది. ఈ సందర్భంగా పోలవరం పనులు త్వరగా పూర్తి చేయమని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించే ఉంటారు.

సాధారణంగా ఏ సాగునీటి ప్రాజెక్టు పనులైన వర్షాకాలం వస్తే నిలిచిపోతుంటాయి. నాలుగేళ్ళ నుంచి పోలవరం పనులు నత్తనడకలు నడుస్తున్నాయి. మళ్ళీ జూన్ నెలాఖరులోగా వర్షాలు మొదలవుతాయి కనుక పూర్తిగా నిలిచిపోతాయి. ఇటువంటి సమయంలో సిఎం జగన్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం విడ్డూరంగానే ఉంటుంది.

అయితే ఆయనకు తీరిక ఉన్నప్పుడు వచ్చి సమీక్షా సమావేశాలు జరుపవచ్చేమో కానీ వర్షాలు మొదలైతే పనులు జరిపించలేరు. మళ్ళీ డిసెంబర్‌ వరకు పోలవరంలో ఇదే పరిస్థితి. అప్పటికి ఎన్నికల గంట ఎలాగూ మ్రోగుతుంది. మరెందుకు ఈ పర్యటన?అంటే ప్రజలకు చెప్పుకోవడానికే కావచ్చు. కానీ ఏం చేశామని చెప్పుకొంటారు?అమరావతిని చంపేశారు. పోలవరాన్ని రివర్స్ చేశారు. మూడు రాజధానులను ఢిల్లీకి చేర్చారు కదా?