YS_JAGAN_Mohan_Reddyమళ్ళీ ఒకటో తారీకు వచ్చేసింది. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి నిధుల కోసం గురువారం ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, ఇతర కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులను తక్షణం విడుదల చేయవలసిందిగా కోరనున్నారు.

సీఎంవో అధికారులు ప్రధాని కార్యాలయంతో మాట్లాడి ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ లభించగానే సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరివెళతారు.

మద్యతరగతి వేతనజీవులు ప్రతీనెల ఒకటో తారీకు జీతాల కోసం ఎదురుచూడటం అందరికీ తెలుసు కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతీనెల ఒకటో తారీకున నిధుల కోసం ఢిల్లీకి వెళ్ళివస్తుండగా చూడటం కేవలం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మాత్రమే దక్కిన భాగ్యం అనుకోవాలేమో?

ఏ ప్రభుత్వానికైనా ప్రభుత్వోద్యోగులకు వేతనాలు, పింఛన్లు, ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు తప్పనిసరి. వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఆదాయం, కేంద్రానికి వెళ్ళే పన్నులలో రాష్ట్ర వాటా నుంచి ఖర్చు చేస్తుంటాయి. అయితే గత మూడేళ్ళుగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే పరిశ్రమలను, వాణిజ్య సంస్థలను, ఐటి కంపెనీలను రప్పించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం, ఉన్న పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు విధిస్తూ, మరోపక్క రాజకీయ కక్ష సాధింపులతో వేధిస్తూ మూతపడేలా చేయడం, చివరికి బంగారుబాతు వంటి సినీ పరిశ్రమను కూడా వేధించడం వంటి అనేక కారణాల వలన రాష్ట్ర ఆదాయంలో పెరుగదల నిలిచిపోయిందని చెప్పవచ్చు.

ఆర్ధిక పరిస్థితి బాగోకపోతే ఎవరైనా ఆదాయం పెంచుకొని ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నం చేస్తారు. వైసీపీ ప్రభుత్వం కూడా విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు పెంచి, ఇంటిపన్ను, చెత్తపన్ను వసూలు చేస్తూ ఆదాయం పెంచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. అయితే వాటితో వచ్చే ఆదాయం కంటే సంక్షేమ పధకాల పేరుతో పప్పుబెల్లాలగా పంచిపెట్టేది పదింతలు ఉండటంతో ప్రతీనెల తప్పనిసరిగా కేంద్రం ముందు చేతులు చాచి దేబిరించవలసి వస్తోంది.

ఏపీతో పోలిస్తే తెలంగాణ ఆర్ధికంగా చాలా బలంగానే ఉంది. అయినప్పటికీ తెలంగాణ సిఎం కేసీఆర్‌ అనవసరంగా సంక్షేమ పధకాలను ప్రకటించడం లేదు. పైగా నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీని అమలుచేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పంట రుణాల మాఫీ హామీని దశలవారీగా అమలుచేస్తున్నారు తప్ప ధనిక రాష్ట్రమని ఒకేసారి చెల్లించేయలేదు. దళిత బంధు పధకం ప్రకటించారు కానీ దానిని చాలా ఆచితూచి అమలుచేస్తున్నారు.

ధనికరాష్ట్రమైన తెలంగాణ ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే, వైసీపీ ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా సంక్షేమ పధకాల కోసం వేలకోట్లు ఖర్చు చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.