YS-Jagan-Personal-Yagam-With-Public-Moneyముఖ్యమంత్రి ఏ కుల, మతానికి చెందినవారైనప్పటికీ అన్ని కులమతాలను సమానంగా ఆదరించడం సత్సాంప్రదాయం కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని లేదా దర్గాలను దర్శించుకొన్నా ఎవరూ తప్పు పట్టలేరు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజల సంక్షేమం కోరుతూ దేవాదాయశాఖ అధ్వర్యంలో విజయవాడలో రాజశ్యామల యజ్ఞం జరిగింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి దగ్గరుండి ఈ యజ్ఞం చేయించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి దీనిలో పాల్గొనప్పుడు చెప్పుకొన్న సంకల్పం వింటే, కోట్లుఖర్చు చేసి ఈ యజ్ఞం ఎందుకు నిర్వహించారో అర్దమవుతుంది.

ఇంతకీ ఏమిటా సంకల్పం అంటే, “నా శత్రువులందరూ నాశనం అయిపోవాలి. నా కోర్టు కేసులన్నిటిలో సానుకూలమైన నిర్ణయాలు వెలువడాలి. నా ఇతర వ్యవహారాలలో ప్రతికూలతలన్నీ తొలగిపోయీ సానుకూల పరిస్థితులు ఏర్పడాలి. పర యంత్ర, పర మంత్ర, పర తంత్ర, పరాకీయ, సర్వదుష్ట గ్రహ నివృత్తి జరగాలి. ఇతరుల వలన కలిగే దుష్టిదోషం పోవాలి. నాకు ఆయురారోగ్యఐశ్వర్యాలు ప్రాప్తించాలి. నా బలం పెరగాలని కోరుకొంటూ ఈ యాగం, హోమాలు నిర్వహిస్తున్నాను,” అని పంతులుగారు ప్రత్యేకంగా తయారుచేసుకొచ్చిన సంకల్పాన్ని చదువుతుంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి దానిని వల్లె వేశారు. అందుకు ఆయనను తప్పు పట్టలేము.

కానీ ఈ యాగాలు, హోమాలు అన్ని ప్రజల కోసమే అని గొప్పగా చెప్పుకొన్నప్పుడు సంకల్పంలో కూడా అదే చెప్పాలి కదా?కానీ సంకల్పంలో కోర్టు కేసులలో కూడా ఉపశమనం లభించాలని, ప్రతిపక్షాలు, వాటి మంత్ర, తంత్రాలు నశించిపోవాలని భగవంతుడిని కొత్తకొత్త కోరికలు కోరుకోవడం విచిత్రంగా ఉంది కదా? ఇవన్నీ ప్రజల కోసం కాదు తన కోసమే చేసుకొంటున్నవని స్పష్టం అయ్యింది కదా?

సిఎం జగన్‌ క్రీస్టియన్ కనుక ఆయనకు హిందూమత విశ్వాసాలపై నమ్మకం ఉండదు. అది సహజం. కానీ ఆయన ప్రజల కోసం ఈ యజ్ఞాలు, హోమాలు చేశారని సరిపెట్టుకొందాము. కానీ ఆయన సంకల్పం (కోరికల చిట్టా) వేరేగా ఉంది. వాటి కోసం తను నమ్మని యజ్ఞాలు,హోమాల కోసం ప్రజాధనం ఖర్చు చేశారు కదా?

హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా భార్యతో కలిసి చేయవలసి ఉంటుంది. కానీ వీటిలో జగన్‌ ఒక్కరే పాల్గొన్నారు. భక్తి, చిత్తశుద్ధి, నమ్మకం లేని పూజలు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరి అటువంటపుడు ఈ యజ్ఞాలు, హోమాలు దేని కోసం చేసిన్నట్లు?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హిందూమత వ్యతిరేకత పెరిపోతోందని ప్రజలు ఆందోళనను గుర్తించి హిందువులను ఉపశమింపజేసేందుకా? హిందువుల ఓటు బ్యాంక్ కోసమా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.