YS Jagan -Pension Schemeనేడు స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఇక నుండి దానిని రైతుల దినోత్సవంగా జరపబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పథకాల ప్రకటనలు న్యూస్ పేపర్లలో ప్రచురించింది. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన ఒక ప్రకటనపై సోషల్ మీడియా విస్తృతంగా చర్చ జరుగుతుంది. వైఎస్సార్ పెన్షన్ కానుక అనే పేరుతో పెన్షన్లు ఈరోజు నుండి ఇవ్వాలని ప్రతినెలా ఒకటి నుండి మూడో తారీఖు లోపు ఇచ్చే పెన్షన్లు ఈరోజు వరకు ఆపేశారు.

వైఎస్సార్ పెన్షన్ కానుక యాడ్ లో నాలుగు నెలల క్రితం వరకూ వెయ్యి రూపాయిలు ఉన్న పెన్షన్ మా ప్రభుత్వం 2250 రూపాయలకు పెంచిందని చెప్పుకోవడం విశేషం. దశలవారీగా పెన్షన్ ను 3000 రూపాయలకు పెంచుతామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. నాలుగు నెలల క్రితం వరకూ వెయ్యి రూపాయిల పెన్షన్ ఉన్నా గత మూడు నెలల నుండి లబ్దిదారులకు 2000 రూపాయిల పెన్షన్ అందుతుంది. ఆ విషయాన్నీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది.

అయితే 2000 రూపాయిల నుండి 2250 రూపాయలకు పెంచాం అని చెబితే బాగోదు అని నాలుగు నెలల క్రితం వరకూ వెయ్యి రూపాయిలు ఉన్న పెన్షన్ మా ప్రభుత్వం 2250 రూపాయలకు పెంచిందని చెప్తున్నారని టీడీపీ శ్రేణుల విమర్శ. పోనీ నాలుగు నెల సంగతి కాకపోతే ఐదు సంవత్సరాల కింద 200 రూపాయిల పెన్షన్ ను 2250 రూపాయిలు చేశాం అని చెప్పుకోవచ్చు కదా అని వారు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 2250 పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో అన్ని చోట్లా పెద్ద ఎత్తున జనం బారులు తీరారు.