YS Jagan - Pawan Kalyanప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో వైసీపీ – బిజెపి – జనసేనలు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఎవరికీ వారు తమదే అధికారం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అంతిమంగా ప్రజలను “ఒకే ఒక్క ఛాన్స్” అంటూ వేడుకుంటున్నారు. ‘మీ బంగారు భవిష్యత్తు కోసం మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అంటూ ప్రజలు ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు.

“ఒక్కసారి అధికారం ఇస్తే… మరో 25 ఏళ్ళ పాటు తామే అధికారంలో ఉండేలా పాలన అందిస్తామని, రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తానని” జగన్ గత మూడేళ్ళుగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం చేస్తోన్న పాదయాత్రలో కూడా ఇంచుమించుగా ఇవే ప్రకటనలు చేస్తున్నారు. ‘వైఎస్’ బొమ్మతో అధికారం అందుకోవాలని ఆశిస్తోన్న జగన్ కు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

ఇక ఇటీవల పోరాటయాత్ర పేరుతో జనంలోకి వెళ్తోన్న పవన్ అయితే…. “అయిదేళ్ళు పాలించే అవకాశం ఒక్కసారి ఇస్తే, ఎప్పటికీ మమ్మల్నే కోరుకునే విధంగా” అంతులేని పాలన అందిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. గడిచిన నాలుగేళ్ళుగా అధికారం తనకు వద్దన్న పవన్, గత నాలుగు నెలలుగా మాత్రం అధికారమే కావాలంటూ ప్రజలను విన్నవించుకుంటున్నారు. మరి పవన్ మాటలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారో చూడాలి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా ఏపీలో పాగా వేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ ఆశలు ఎప్పటికీ నెరవేరకపోవచ్చు. బహుశా భవిష్యత్తులో వైసీపీనో, జనసేనో బిజెపిలో విలీనం చేస్తే తప్ప, ఏపీ ప్రజలతో కమలంపై ఓటు వేయించడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. టార్గెట్ టిడిపిగా సాగుతోన్న ఈ మూడు పార్టీలలో దేనిని విశ్వసిస్తారో లేక అధికార పార్టీనే నమ్ముకుంటారో అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.