YS Jagan - Pawan Kalyan - Somu Verrajuమునిసిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా సాక్షి ఇచ్చిన కవరేజ్ లో బీజేపీ – జనసేన పొత్తు పై ప్రత్యేకించి టార్గెట్ గా చేసుకున్నట్టుగా కనిపించింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ పై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ… మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే ఎత్తుగడలు పారకపోవడంతో ఇక దీన్ని ఎక్కువ కాలం కొనసాగించరాదన్న చంద్రబాబు సూచనల మేరకే పవన్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకుని టీడీపీతో బహిరంగ స్నేహం దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోందని సాక్షి వ్యాఖ్యానించింది.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి టీడీపీకి ప్రయోజనం కలిగించాలని పవన్‌కల్యాణ్‌ భావించినా బీజేపీ నేతలు అక్కడ తామే పోటీ చేస్తామని ప్రకటించారు. టీడీపీని చేరువ చేసేందుకు పవన్‌ చేసిన ప్రయత్నాలు బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద చెల్లుబాటు కాలేదని కూడా చెప్పుకొచ్చింది. ఈ వ్యవహారం చూస్తే జనసేన, బీజేపీల మధ్య సాక్షి చిచ్చు పెట్టే ప్రయత్నంగా కనిపిస్తుంది.

“కేంద్రంలోని బీజేపీతో వైఎస్సార్ కాంగ్రెస్ అంటకాగుతుంది. మైనారిటీ ఓట్లు పోయే ప్రమాదం లేకపోతే బహిరంగంగానే పొత్తు పెట్టుకునేది. ఈ క్రమంలో తాము సత్సంబంధాలు నెరిపే క్రమంలో ఇక ఏ పార్టీ కూడా బీజేపీ పంచన చేరకూడదని… అదే సమయంలో కాషాయ పార్టీ ఒంటరిగా ఎదగలేదనేది వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుంది,” అని విశ్లేషకులు అంటున్నారు.

అదే సమయంలో ఏపీలో మత రాజకీయాలు పని చెయ్యలేదు. ఆయా చోట్ల కూడా ప్రజలు తమకే పట్టం కట్టారు అని సాక్షి చెప్పుకొచ్చింది. అయితే మత రాజకీయాలు చేసింది చంద్రబాబే అంటూ రాసి… ఒక కార్టూన్ కూడా వేసింది. ఎక్కడా బీజేపీ జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడటం విశేషం. దాన్నిబట్టే సాక్షి, వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహం అర్ధం అవుతుంది.