YS Jagan Nandyal Bi Electionsదేశ రాజకీయాలు ఎలా ఉన్నా… వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నంత కాలం వరకు రాష్ట్ర రాజకీయాలు అధ్వాన స్థితిలో అయితే లేవు. ఎప్పుడైతే వైఎస్ స్థానంలోకి జగన్ వచ్చారో… అప్పుడు మొదలైంది అసలు రచ్చ. అప్పుడే రాష్ట్ర విభజనకు బీజం పడింది కూడా! నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్ష్య సాధించడం కోసం కేసీఆర్ ను జగనే ఉసిగొల్పారన్న వార్తలు అప్పట్లో పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన వైనం రాజకీయ విజ్ఞులకు తెలిసిందే. అలా ‘విభజన’తో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని భావించిన జగన్, ఒకానొక సమయం అది వర్కౌట్ కాదన్న అంచనాలతో మరో వైపు నుండి ‘మతాన్ని’ తెరపైకి తీసుకువచ్చారు.

అప్పటివరకు మతానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని తెలుగు ప్రజలు, జగన్ పుణ్యమా అంటూ అక్కడ కూడా విభేదాలు తలెత్తడం విశేషం. అయితే ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా… చివరికి ప్రజలు ‘ఈయన మాకొద్దు’ అని పక్కన పెట్టడంతో, అధికారానికి దూరమైన జగన్, ఆ తర్వాత నుండి ‘పార్ట్ టైం’ పొలిటిక్స్ చేస్తున్నారన్న టాక్ ను సొంతం చేసుకున్నారు. విభజన జరిగిన తర్వాత ఏపీ పరిపాలన అంతా విజయవాడ, అమరావతి కేంద్రంగా జరుగుతుంటే, జగన్ మాత్రం హైదరాబాద్ లోనే ఉంటూ అడపాదడపా వార్తల్లో నిలిచారు. అయితే అలా హైదరాబాద్ లోనే జగన్ ఉండడానికి, అక్రమాస్తుల కేసు (ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టు) కీలక పాత్ర పోషించిందిలేండి!

అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ళ సమయం కూడా లేదు. అందులోనూ నంద్యాల ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇందులో గెలిచి, తదుపరి ఎన్నికలలో విజయం తమదే అన్న సంకేతాలను అటు కేంద్రానికి, ఇటు ప్రజలకు ఇవ్వడానికి జగన్ పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఈ ఉప ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో అధికార పార్టీని దిగజార్చే క్రమంలో తనను తాను దిగజార్చుకోవడం బహుశా జగన్ కే సాధ్యమేమో అన్న రీతిలో విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్ని ఎక్కువ తిట్లు తిడితే, అంత పెద్ద విజయం దక్కుతుందని భావించారో ఏమో గానీ, చంద్రబాబు లక్ష్యంగా జగన్ చేసిన కామెంట్లు విని చీదరించుకోవడం ప్రజల వంతవుతోంది.

రాజకీయాలలో ‘స్వార్ధం’ అనేది కీలక పాత్ర పోషిస్తున్న మాట నిజమే. ఏ రాజకీయ నాయకుడు అయినా ప్రజల సంక్షేమం కంటే, తన రాజకీయంలో స్వార్ధానికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ, జగన్ క్రియాశీలక రాజకీయాలలోకి ప్రవేశించిన తర్వాత రాజకీయమే స్వార్ధంగా మారిపోయే విధంగా సరికొత్త ‘ట్రెండ్’కు శ్రీకారం చుట్టారు. అందుకే ప్రజలు ఏం అడిగినా, ఏం చెప్పినా… జగన్ నుండి మాత్రం ఒక్కటే మాట… ‘నన్ను ముఖ్యమంత్రిని చేయండి’ అని..! రాజకీయాలలో శాశ్వత శతృత్వం, మిత్రుత్వం ఉందంటారు… కానీ జగన్ పుణ్యమా అని, మిత్రుత్వం మాట పక్కన పెడితే, శతృత్వాన్ని మాత్రం పెంచి పోషిస్తున్నారని స్పష్టంగా కనపడుతోంది.

ప్రభుత్వ ఉద్యోగుల నుండి ముఖ్యమంత్రి వరకు అందరిపై “రివేంజ్” తీర్చుకోవడానికే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారేమో… అనిపించేలా జగన్ వ్యాఖ్యలు నిలుస్తున్నాయన్న భావన ప్రజలలో వ్యక్తమవుతున్నాయి.