ys jagan padayatra postponedఅక్టోబర్ 27వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, దీనిపై పునరాలోచనలో పడ్డారా? అంటే అవుననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. ప్రస్తుతానికి ఈ పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా వేసే ఉద్దేశంలో జగన్ ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టు కేసుల రీత్యా ప్రతి శుక్రవారం నాడు హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడమే దీనికి ప్రధాన కారణంగా వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి.

వాస్తవానికి ఈ పాదయాత్ర కోసం కోర్టు నుండి అనుమతి కోరుతూ జగన్ ఓ పిటిషన్ కూడా దాఖలు చేసారు. అయితే రాజకీయ అవసరాల నిమిత్తం అనుమతి ఇవ్వబోమంటూ కోర్టు స్పష్టం చేస్తూ, అనుమతిని నిరాకరించింది. కానీ ఈ పాదయాత్రకు కోర్టు అనుమతి వస్తుందన్న ఉద్దేశంతో ‘పాదయాత్ర’ అంశాన్ని జగన్ ముందుగానే ప్రకటించేసారని, లేకుంటే కోర్టు ఉత్తర్వులు తర్వాత ఓ ప్రకటన చేసి ఉండేవారని పొలిటికల్ టాక్. అయితే అక్టోబర్ మొదటి వారం నుంచి జిల్లాల వారీగా జగన్ పర్యటించనున్నారని, పార్టీ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు జరపనున్నారని సమాచారం.

ఓ పక్కన పాదయాత్ర… మరో పక్కన ఫ్రైడే కోర్టు… ఇలా రెండింటిలో కూడా కోర్టు అంశం హైలైట్ గా నిలిచి, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే కేసులు ముగిసిన తర్వాత పాదయాత్రను ప్రారంభించే యోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా విచారణ దశలో ఉన్న కేసులు ఎప్పటికి పూర్తవుతాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీంతో పాదయాత్ర విషయంలో ప్రస్తుతం వైసీపీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నారని, ఏది ఏమైనా అక్టోబర్ 27న అయితే ప్రారంభం కాదని, పక్కాగా చేయాలని భావిస్తే మాత్రం నవంబర్ మొదటి వారం నుండి ప్రారంభించే ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.