YS Jagan Padayatraప్రజాసంకల్పయాత్ర….ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం. రాష్ట్ర రాజకీయాలనే తారుమారు చేసింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొంప, గూడు వదిలేసి రోడ్లు పట్టుకుని తిరిగాడు. కొన్ని వేల కిలోమీటర్లు నడిచాడు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ…ప్రజా సమస్యలను తెలుసుకుని…2019లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీలో శపథం చేసినట్లుగానే సీఎంగా బాధ్యతలు చేపట్టాకే అడుగుపెట్టారు.

తాను అనుకున్నట్లుగానే ప్రజాసంకల్పయాత్రను పూర్తి చేసి అఖండమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. జగన్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నర ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ముందుకు సాగుతున్నాని చెప్పిన జగన్…సీఎంగా బాధ్యతలు చేపట్టాక…తాడేపల్లి ప్యాలేస్ కు మాత్రమే అంకితమయ్యారు.

అధికారం కోసం ప్రజల మధ్య తిరిగిన జగన్….అధికారంలోకి వచ్చా వారిని పూర్తిగా విస్మరించారు. ఎప్పుడో అడపాదడపా పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం…ఆ మీటింగ్స్ కు ప్రభుత్వం తరపున జనాలను సమీకరించడం…అధికారులు రాసిచ్చిన స్క్రిప్టును చదివి వినిపించడం తప్పా ఆయన చేసిందేం లేదు.

ఒకవేళ పబ్లిక్ మీటింగ్స్ కుదరకపోయినట్లయితే…అధికారులతో సమీక్షలు నిర్వహించడం తప్ప ప్రజల మధ్యకు వచ్చింది లేదు. వారి సమస్యలను పట్టించుకున్నదీ లేదు. జగన్ రెడ్డి తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు, పాలనపారదర్శకత లేకపోవటం, రాజధానిపై అయోమయం సృష్టించడం, సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రం ఆర్థికంగా దివాళ తీసేలా చేయడం, ప్రతిపక్షాలపై దాడులు ఇవన్నీ కూడా జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నట్లు సొంత పార్టీ కార్యకర్తలే ఫీలవుతున్నారు.

అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదంటూ లోలోపల మదనపడుతున్నారట వైసీపీ కార్యకర్తలు. పొరుగు రాష్ట్రాలు అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే…ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం దిగజారుతుందని సొంతపార్టీ వాళ్లే అనుకుంటున్నారట. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో ఎవరికీ ఎదురుకానంతటి వ్యతిరేకతను జగన్ మూటగట్టుకుంటున్నారు.