Chandrababu- Naidu-YS Jagan-ఈ నెల 28 నుండి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధానికి భూములిచ్చిన గ్రామాలలో పర్యటిస్తారని ప్రకటించిన నాటి నుండీ అధికార పార్టీ నేతలలో కలవరం మొదలయినట్టుగా ఉంది. రైతుల ముసుగులో కొందరు పార్టీ కార్యకర్తలతో చంద్రబాబుని తిట్టించారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఎదురుదాడి చేసారు

అయితే అమరావతిని శ్మశానం అనడంతో కథ అడ్డం తిరిగింది. అయితే నిన్న ముఖ్యమంత్రి సీఆర్డీఏ అధికారులతో సమావేశం అయ్యారు. అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతుల పనుల్ని కొనసాగించేందుకు అంగీకరించారు. ఆర్భాటాలకు వెళ్లకుండా, అనవసర ఖర్చులు తగ్గించుకుని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రాజధానిలో ప్రధాన రహదారుల నిర్మాణం, భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన (ఎల్‌పీఎస్‌) లేఅవుట్‌లలో మౌలిక వసతుల అభివృద్ధి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిలభారత సర్వీసు అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు గృహనిర్మాణాల వంటి… ఇప్పటికే చేపట్టిన పనులన్నింటినీ కొనసాగించాలని నిర్ణయించారు. ఆ పనుల పరిమాణం, ఖర్చు తగ్గించాలని సీఎం ఆదేశించారు.

దానికి అవసరమైన నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణంపై మాత్రం నిపుణుల కమిటీ నివేదిక వచ్చాకే నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతిలోని కట్టడాలు అన్నీ ఆపేసి ప్రభుత్వం మొట్టమొదటి సారిగా భూములిచ్చిన రైతులకు ఆనందాన్ని ఇచ్చే నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీకి రాజకీయ లబ్ది కలగకూడదు అనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.