ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం ఉదయం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… సంచలన నిలయం ప్రకటించారు. ‘మనం అందరం కూర్చున్న ఈ భవనం చట్టబద్ధమైన నిర్మాణమేనా?. ఈ భవనం అవినీతి సొమ్ముతో కట్టింది. అక్రమంగా నిర్మించిన భవనమని తెలిసీ ఇక్కడే మనం సమావేశం పెట్టుకున్నాం. మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలియజేయడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించా,” అని జగన్ చెప్పారు.
“ప్రక్షాళన ఈ భవనం నుంచే ప్రారంభం కావాలి. ఎల్లుండి నుంచే ఈ భవనం కూల్చివేత పనులు చేపడతాం. ఇదే ఈ భవనంలో చివరి సమావేశం. ప్రజావేదిక నుంచే రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభిద్దాం.’ అని జగన్ అధికారులకు పిలుపునిచ్చారు. అయితే ఇది ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా కనిపిస్తుంది. గతంలో తాము చేసిన ఆరోపణలను నిరూపించుకునేందుకు, అక్రమ బిల్డింగ్ అని ఆరోపించి అక్కడే కలెక్టర్ల సదస్సు నిర్వహించుకోవడంపై వస్తున్న ఆరోపణలను ఎదురుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది.
అదే సమయంలో ప్రజా వేదికకు కూత వేటులో ఉన్న చంద్రబాబు నాయుడు గృహాన్ని కూడా ప్రభుత్వం కూల్చివేసే దిశగా ఇది తొలి అడుగుగా కనిపిస్తుంది. అయితే కృష్ణా నది కరకట్ట మీద గణపతి సచ్చిదానంద ఆశ్రమం, మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం, బీజేపీ మాజీ ఎంపీ గంగరాజు గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడాలే. వాటిని కూడా కూల్చి ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకుంటుందేమో చూడాలి. ఇటీవలే గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో స్వరూపానందేంద్ర స్వామి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరైన విషయం తెలిసిందే.