ఈ మాటలన్నది ఎవరో తెలిసే ఉంటుంది. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి. పల్నాడు జిల్లా, చిలకలూరిపేటలోని లింగంగుంట్లలో నేడు ‘ఫ్యామిలీ డాక్టర్’ పధకాన్ని ప్రారంభిస్తూ, “నవరత్నాలతో మీ ఈ బిడ్డ మీ దగ్గరకు వస్తుంటే, నన్ను ఎదుర్కొలేక ఈ తోడేళ్ళన్నీ ఏకమయ్యి నా మీదకు వస్తున్నాయి. వాటితో మీ ఈ బిడ్డ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. వాళ్ళకు ఎత్తులు, జిత్తులు, పొత్తులు, కుయుక్తులు మాత్రమే ఉన్నాయి. నాకు వాళ్ళలా అంగబలం, అర్దబలం లేకపోవచ్చు. కానీ వాళ్ళకు లేనిది నాకున్నవి ఏమిటంటే పైనున్న ఆ భగవంతుడి ఆశీస్సులు, మీ చల్లటి దీవెనలు. నాకు ఎవరితోనూ పొత్తులు లేవు. పొత్తుల కోసం ఎవరిమీద ఆధారపడను. నాకు మీతోనే పొత్తులు,” అంటూ తన అద్భుతమైన పాలన గురించి చెప్పుకొంటూ, ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నవరత్నాలను పంచిపెడుతున్నానని సిఎం జగన్‌ గొప్పగా చెప్పుకొంటే, మా జీతాలలో నుంచి కోసుకొన్న సొమ్ము కూడా జగన్ ప్రభుత్వం వాడేసుకొంటోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో వైసీపీతో పొత్తులు పెట్టుకోవడానికి ఏ పార్టీ సిద్దంగా లేదు కనుకనే ఒంటరిగా పోటీ చేయాల్సివస్తోంది తప్ప జగన్‌ పొత్తులు వద్దనుకొన్నందున కాదనే విషయం అందరికీ తెలుసు.

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షంలో ఉన్న రాజకీయపార్టీలు పొత్తులు పెట్టుకోవడంపై రాజ్యాంగంలో ఎటువంటి నిషేదమూ లేదు. కానీ సిఎం జగన్‌ తన అనుమతి లేకుండా, తనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకోవడం నేరం అన్నట్లు మాట్లాడుతుండటం విస్మయం కలిగిస్తుంది. ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకొంటే వాళ్ళందరూ తోడేళ్ళ గుంపని చెపుతున్నారు. ఇదెక్కడి రాజకీయ వితండవాదమో అర్దం కాదు.

సిఎం జగన్‌ ప్రాస కోసం ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు అంటూ మాట్లాడి చప్పట్లు కొట్టించుకోవచ్చు. కానీ గత నాలుగేళ్ళుగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలను, చివరికి అమరావతి రైతుల పట్ల కూడా తన ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు రోడ్ షోలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయించడం, చీకట్లో రాళ్ళు వేయించడాన్ని, నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూయించి వేసి, టిడిపి నేతలు మళ్ళీ వాటిని నిర్వహించబోతే వారిపై దాడులు చేయించి, ఎదురు కేసులు బనాయించడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి.

ప్రతిపక్షాలకు లేని భగవంతుడి ఆశీస్సులు తనకు మాత్రమే ఉన్నాయని సిఎం జగన్‌ గొప్పగా చెప్పుకొంన్నారు. మంచిదే. మరి ఎమ్మెల్సీ ఎన్నికలలో నాలుగు స్థానాలలో వైసీపీ ఎందుకు ఓడిపోయింది?సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓట్లు వేశారు? అంటే ఆయన వెంట భగవంతుడు లేడు… ప్రజలూ లేరు… చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేరని అర్దమవుతోంది కదా?

వెనక ఎవరూ లేరు కనుకనే వైసీపీ అధినేత ఒంటరివాడయ్యారని అర్దమవుతోంది. ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఎవరైనా ఒంటరి పోరాటమే చేయాల్సి ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు శత్రువులు కలిసి దండయాత్రకు వస్తుంటే ఎవరికైనా భయం కలుగుతుంది. అటువంటప్పుడు ఎవరైనా పైకే ఆ భగవంతుడి సాయం కోసమే చూస్తారు. లేదా తనకు అండగా నిలబడేవారి కోసం చుట్టూ చూస్తారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే చేస్తున్నారనుకోవచ్చు. కానీ శత్రువులు ఒకరి తర్వాత వచ్చి అందరూ తన చేతిలో చావాలని కోరుకోవడం చాలా విడ్డూరంగా ఉంది.