ys jagan one chance again 2024 elections2019 ఎన్నికల ప్రచారంలో “ఒక్క ఛాన్స్ ప్లీజ్!” అంటూ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్ధించిన తీరుకు కరిగిపోయిన ప్రజలు ఏకంగా 151 సీట్లతో అవకాశమిచ్చారు. తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశాన్ని అందించారు ఏపీ ప్రజలు. అయితే ఇప్పుడు అదే వారి పాలిట శాపంగా మారి, ప్రజలే రోడ్ల పైకి వచ్చి నిరసనను తెలియజేసే పరిస్థితులు నెలకొన్నాయి.

ఇందులో ముందు వరుసలో రాజధాని గ్రామస్తులు ఉన్నారు. ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అన్న జగన్ ను ఆదరించినందుకు తమ జీవితాలను, తమ పిల్లల భవిష్యత్తును రోడ్డు మీద నిలబెట్టారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు రోడ్డు మీదే ఉన్నారు. ఇసుక పాలసీ మార్చాలంటూ కొంత కాలం ఇసుకను అందుబాటులో ఉంచకుండా ఎందరో భవన నిర్మాణ కార్మికుల ఆకలి చావులకు వేదికైంది ఏపీ రాష్ట్రం.

ఆకలి చావులు పరిచయం లేని రాష్ట్రానికి వాటిని పరిచయం చేసిన ఘనత కూడా ఈ ‘ఒక్క ఛాన్స్’ పాలసీ మహిమే. మధ్య నిషేధం అన్నారు ప్రభుత్వమే మద్యం షాపులను నడుపుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేయలేదు., పెట్టుబడులు పెట్టి తమ వ్యాపారాలు తాము చేసుకుంటుంటే, వాటిని లాగేసుకుని ఆ వ్యాపారస్తులను, దానిపై ఆధారపడి పని చేసే సిబ్బందిని రోడ్డు మీదకు తీసువచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని సదరు వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నారు.

పని కల్పించడు, ఉన్న పని చేసుకోనివ్వడు అన్న చందంగా మారింది జగన్ వైఖరి అంటూ నిస్సహాయంలో ఉన్నారు సదరు వ్యాపారస్తులు. గత ప్రభుత్వ హయాంలో టెండర్లు వేసి పనులు పూర్తి చేసి బిల్లుల చెల్లింపుకు ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్ల బతుకులు చివరకు చేరేది రోడ్డు మీదకే అంటున్నారు కాంట్రాక్టర్ సంఘం నాయకులు.

నవ్యఆంధ్రప్రదేశ్ అంటూ చంద్రబాబు ఇచ్చిన బ్రాండ్ ఇమేజ్ తో ఒక వెలుగు వెలిగిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం., ‘ఒక్క ఛాన్స్’ చలవతో పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోయింది. భూముల మీద పెట్టుబడులు పెట్టిన ఔత్సహికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎయిడెడ్ స్కూల్స్ విలీనం అంటూ చదువు తప్ప మరో ప్రపంచం తెలియని పిల్లలు సైతం తమ స్కూల్స్ ని దక్కించుకోవడానికి రోడ్డు మీదకు రావాల్సి వచ్చింది.

మన ప్రజా ప్రభుత్వం వచ్చిన వారం రోజులలోపు సీపీఎస్ రద్దు చేస్తాం అందుకు మీరు ‘ఒక్క ఛాన్స్’ ఇవ్వాలంటూ ప్రభుత్వ ఉద్యోగులను అభ్యర్ధించిన జగన్ ఛాన్స్ వచ్చాక సేమ్ సీన్ రిపీట్ చేశారని ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి తమ ఆందోళనలు కొనసాగించారు. జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులతో ఆశలు కల్పించి, చివరకు అధికారం వచ్చాక జాబుల కోసం రోడ్ల మీదకు వచ్చిన నిరుద్యోగ యువతను పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పారిశుధ్య కార్మికులు… ఇలా చెప్పుకుంటూ పోతే మరెందరో పరిస్థితి రోడ్డు మీదే ఉంది అంటూ ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షానికి ఎత్తిచూపిస్తున్నాయి. ఎన్నికల ముందు పాదయాత్ర పేరుతో రోడ్డు మీద తిరుగుతూ ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ వేడుకుంటూ చివరకు ఛాన్స్ ఇచ్చాక తమ బతుకులను, భవిష్యత్తును రోడ్డు మీదకు లాగారంటూ ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది.

ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రాన్ని , రాష్ట్ర భవిష్యత్తును 25 సంవత్సరాల తిరోగమనానికి తీసుకువెళ్లారని, ప్రజలు భవిష్యత్తుని రోడ్ల మీదకు తీసుకువచ్చారని., ఇక మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్ర పరిస్థితి? ఏంటో అంటూ తలలు పట్టుకుంటున్నారు బాధిత కుటుంబాలు. ఒకవేళ మరో ఛాన్స్ గనుక ఏ విధంగా అయినా దక్కితే, పొరుగు రాష్ట్రాల వంక చూస్తున్న ప్రజలు ఎంత మందో ఓ సర్వే చేయిస్తే, నివ్వెరపోయే వాస్తవాలు బయటకు వస్తాయన్నది ప్రజల భావన.