YS jagan on Vijayawada Liquor Tragedyఈ వ్యాఖ్యలు చేసింది అధికార పార్టీ సభ్యులో, జగన్ ను వ్యతిరేకించే వారో కాదు.., వైసీపీ నాయకులే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట. ‘సంపూర్ణ మద్యపాన నిషేధం’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపడంతో, అవి తిరిగి తిరిగి ఆ పార్టీ సభ్యులైన బొత్స సత్యనారాయణ వంటి వారిని తాకాయి. దీనికి తోడు, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, “జగన్ చేసిన మద్యపాన నిషేధానికి పార్టీ సభ్యులు కట్టుబడి ఉన్నారని, లిక్కర్ బిజినెస్ లో ఉన్న వైసీపీ నేతలు ఈ వ్యాపారం నుండి తప్పుకోవాలని” పిలుపునిచ్చారు.

‘ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు…’ ఎక్కడో విజయవాడలో కల్తీ మద్యానికి ఎవరో పాల్పడడమేమిటి… అవి తాగి వారెవరో చనిపోవడమేమిటి… దానికి మీరు మద్యపాన నిషేధం ప్రకటించడమేమిటి… మళ్ళీ నన్ను టార్గెట్ చేయడమేంటి..? అంటూ పార్టీ అధినేత జగన్ వద్ద వాపోవడం బొత్స గారి వంతయ్యిందని మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ సందర్భంగా మద్యపానంపై వైయస్ అవలంభించిన విధానాలను కూడా బొత్స సత్యనారాయణ, జగన్ వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యపాన నిషేధంపై ఒకటి, రెండు సార్లు అధ్యయనం చేసారని, దీనిని అమలు పరిస్తే ప్రధానంగా “రెండు” రకాలుగా నష్టం వాటిల్లుతుందనే నివేదికలతో… ఆ తర్వాత ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసారని రాజకీయ వర్గాల టాక్. అంతేగాక, మునుపటి కంటే మిన్నగా మద్యం వ్యాపారం జోరుగా సాగే విధంగా వైయస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని.., ఆ వ్యత్యాసం రాష్ట్ర రెవిన్యూలో స్పష్టంగా కనపడిందని పరిశీలకులు చెబుతున్నారు. మద్యపాన నిషేధం సాధ్యం కాదు కాబట్టే… గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు సైతం కేవలం ‘బెల్ట్’ షాపుల నియంత్రణ వరకే హామీ ఇచ్చారని, ఆ దిశగానే చర్యలు చేపట్టారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మద్యపాన నిషేధం వలన ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయ లోటు ఏర్పడనుంది. ప్రతి ఏటా సమగ్రమైన వృద్ధి రేటు గల ఈ శాఖను నియంత్రిస్తే, ఏపీ ఆర్ధిక కష్టాలు మరింతగా పెచ్చుమీరుతాయని అంటున్నారు. ఇక మరో ప్రధాన సమస్య… రాజకీయ పార్టీలకు ఎదురు కానుంది. ఏ బహిరంగ సమావేశం జరిగినా… ఎటువంటి ప్రచారం నిర్వహించినా… మెనూలో ఖచ్చితంగా మద్యం ఐటెం ఉండాల్సిందే. కార్యకర్తల కోసం, జనాల తరలింపు కోసం రాజకీయ నాయకులు ఆకర్షించే జాబితాలో మద్యం మొదటి స్థానంలో ఉంటుంది. అందులోనూ దీక్షలు, యాత్రలు అంటూ కాలయాపన చేసే జగన్ కు మద్యపాన నిషేధం అమలు చేయడం అసలు సాధ్యం కాని అంశంగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు.

ఏదో ఆవేశంలో జగన్ ‘టంగ్ స్లిప్’ అయ్యి ఉంటారు తప్ప, వైయస్, చంద్రబాబులు అమలు చేయలేని అంశాన్ని జగన్ నెత్తికెత్తుకుంటారని భావించడం లేదని వైసీపీ నాయకులు అంతర్గతంగా వ్యాఖ్యానించుకుంటున్నారట. అయినా ఒక్కోసారి జగన్ చేసే ప్రకటనలను చూసి ఆ పార్టీ వర్గీయులే తలలు పట్టుకుంటున్నారని పొలిటికల్ వర్గాల టాక్.