YS jagan on MLA roja suspension high court caseరోజా ఉదంతం మరో మలుపు తీసుకుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర తీర్పును ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దీంతో అసెంబ్లీలోకి అడుగు పెట్టే అవకాశం రోజాకు లేకుండా పోయింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సందర్భంలో “న్యాయమే గెలిచింది” అంటూ వ్యాఖ్యలు చేసిన జగన్, రోజాలు ప్రస్తుతం ఏమని స్పందిస్తున్నారో చూడాలి.

సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై వాదోపవాదాలు విన్న తర్వాత ద్విసభ్య ధర్మాసనం నేడు తుది తీర్పు ఇచ్చింది. అలాగే సింగిల్ బెంచ్ ఎదుట కౌంటర్ దాఖలు చేయాలని రోజాకు సూచించారు. దీంతో జగన్ తో పాటు రోజా కూడా షాక్ కు గురవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్డర్ కాపీని దాదాపు గంటన్నర్ర సేపు చదివి వినిపించగా, ఆర్డర్ ప్రతులను రోజా తరపు న్యాయవాది కోరగా, అది పూర్తి కావడానికి మరో రోజు సమయం పడుతుందని న్యాయవాదులు చెప్తున్నారు.

ఆర్డర్ ప్రతులు తీసుకున్న తర్వాత మరో వారం రోజుల్లో సింగిల్ బెంచ్ ఎదుట కౌంటర్ ఫైల్ చేసే సదుపాయం లేదా సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయని కూడా రోజా తరపు న్యాయవాదులు చెప్తున్నారు. రోజాపై వచ్చిన ఈ తీర్పుతో నేడు అసెంబ్లీకి “నల్లచొక్కాలు” వేసుకుని వెళ్ళిన జగన్ వర్గీయులు “తెల్లమొహం” వేయాల్సిన పరిస్థితి నెలకొంది.