YS Jagan on english medium schools in districtప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ తో పాటు తెలుగు ఆప్షన్ కూడా ఇచ్చి ఏది కావాలో విద్యార్థులను, వారి తల్లితండ్రులను నిర్ణయించుకోనివ్వండి అని ప్రతిపక్షాలు అన్నా ముఖ్యమంత్రి జగన్ ససేమిరా అన్నారు.

అయితే ఇప్పుడు ఆ విషయం కోర్టులకు చేరడంతో తమ వైఖరిని కొద్దిగా మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది. మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాలను కొనసాగిస్తామని, ఒకవేళ ఆ పాఠశాల దూరమైతే విద్యార్థులకు రవాణా ఖర్చులు ఇస్తామని, అలాగే రాష్ట్రంలో అమలు అవుతున్న కన్నడ, ఉర్దూ, తమిళం, ఒడియా పాఠశాలలను కొనసాగిస్తామని ప్రభుత్వం హై కోర్టులో తెలిపింది. అయితే హైకోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాగా “ఇంగ్లిష్‌ ఒక లగ్జరీ కాదు.. అవసరం. మంచి ఉద్యోగం కావాలంటే ఇంగ్లి్‌షలో ప్రావీణ్యం తప్పనిసరి. ఒక కుటుంబానికి తండ్రి పెద్దయితే.. రాష్ట్రానికి సీఎం తండ్రిలాంటివాడు. ఒక తండ్రిగా నేను నా పిల్లలను ఆంగ్ల మాధ్యమం స్కూలుకే పంపిస్తాను. పేద కుటుంబాల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో ఎందుకు చదువుకోకూడదు,” అని నిన్న సీఎం జగన్ ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.

ఈ కేసు విచారణ హైకోర్టులో పూర్తి అయ్యేవరకు ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన పుస్తకాలు ముద్రించడం గానీ ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వడం గానీ చేస్తే దానికి అధికారులు బాధ్యత వహించాలని ఆ ఖర్చులను వారి నుండి రాబడతామని హైకోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే.