YS--Jagan-Jr-NTRదాదాపుగా పదేళ్ళ కష్టం తరువాత అధికారం చేజిక్కించుకున్నాడు వైఎస్ జగన్. అది కూడా 151 సీట్లతో అనితరసాధ్యమైన విజయం. తెలుగుదేశం పార్టీని కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. అయితే ఆ పార్టీని అలా వదిలెయ్యకూడదని, చావుదెబ్బ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు జగన్. అందులో భాగంగానే టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఏదైనా ఉందేమో అని శోధిస్తున్నారు. చంద్రబాబును జైలుకు పంపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ని తన వైపుకు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.

జగన్ కేబినెట్ లో ఎన్టీఆర్ మిత్రుడు కొడాలి నాని మంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వారిద్దరినీ ఎన్టీఆర్ వద్దకు రాయభారానికి జగన్ పంపినట్టు సమాచారం. రాష్ట్ర టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తా అని జగన్ ఎన్టీఆర్ కు ఆఫర్ ఇచ్చారట. అయితే దానిని ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఎన్టీఆర్ ఈ ఆఫర్ తీసుకోవడం అంటే ఒక వర్గానికి దూరం కావడమే.

అదే సమయంలో భవిష్యత్తులో తాను రాజకీయ ప్రవేశం చేస్తే తనకు ఇబ్బంది కలుగవచ్చు. దీనితో ఇప్పట్లో తాను రాజకీయాలకు దగ్గరగా జరగడం కుదరదని ఎన్టీఆర్ తేల్చి చెప్పాడట. ఆఫర్ ఇచ్చినందుకు మాత్రం థాంక్స్ అని కబురు పంపాడట. దీంట్లో ఎంతవరకూ నిజం అనేది దేవుడికే తెలియాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రంలో ఆయన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది జులై 30న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.