YS Jagan Oath taking as chief minister in vijayawadaఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో 150కు పైగా సీట్లతో విజయ దుంధుబి మోగించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపటిక్రితం మీడియాతో మాట్లాడారు. “ఇంతటి ఘన విజయం చరిత్రలో నూతన అధ్యాయం. ఎక్కువ స్థానాలు గెలవడం చరిత్రాత్మకం. ఈ విజయం దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంలో సాధ్యమైంది. నాపై విశ్వాసంతో ప్రజలు ఓటు వేశారు. 5కోట్లమందిలో ఒకరికే సీఎం అయ్యే అవకాశం లభిస్తుంది. అలాంటి అరుదైన అవకాశం నాకు వచ్చింది,” అని జగన్ అన్నారు.

“పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా.. విన్నా.. వాళ్ల కోసం నేను ఉన్నా. నా ప్రమాణ స్వీకారం ఈనెల 30న విజయవాడలోనే జరుగుతుంది,” అని జగన్ ప్రకటించారు. ఒకరకంగా ఈ ప్రకటన ద్వారా జగన్ తనకు రాజధానిని అమరావతి నుండి తరలించే ఉద్దేశం లేదని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అయ్యింది. దీనితో ఆ ప్రాంతం ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు. అంతకు ముందు జగన్ ఇడుపులపాయలో గానీ తిరుపతిలో గాని ప్రమాణస్వీకారం చేస్తారని అంతా భావించారు.

అయితే పార్టీ నేతలతో చర్చించి విజయవాడలోనే ప్రమాణస్వీకారం చెయ్యాలని జగన్ నిర్ణయించుకున్నారు. మరోవైపు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్‌ ఘన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీష్‌రెడ్డిపై 90,543 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 2014లో వైఎస్‌ జగన్‌ భారీ మెజార్టీతో ఇక్కడ విజయం సాధించారు. అప్పటి మెజారిటీ కంటే మెరుగైన మెజారిటీ తో ఇప్పుడు గెలిచారు.