YS Jagan not serious on Vivekananda Reddy murder caseమాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఎటువెళ్తుంది అనేది తేలకుండా ఉంది. హత్య జరిగి పది నెలలు కావొస్తున్నా ఇప్పటివరకూ ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. ఒక రాజకీయ ప్రముఖుడు… ముఖ్యమంత్రి బాబాయ్ హత్య కేసులో పురోగతి ఇలా ఉండటం అంటే దారుణం అనే చెప్పుకోవాలి.

ఇది ఇలా ఉండగా.. హత్య వెనుక ఐదుగురు రాజకీయ పెద్దల జోక్యం ఉందని మృతుని భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె ఎన్‌.సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసు.. సీబీఐ దర్యాప్తునకు అప్పగించడానికి తగినదని విన్నవించారు.

ఎన్నికల ముందు వివేకా హత్య కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు లేదా సీబీఐకి అప్పగించాలని మృతుడి భార్య వైఎస్‌ సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చాకా జగన్ మాట మార్చి సిబిఐ విచారణ అవసరం లేదంటున్నారు.

వివేకా కుటుంబ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల మీదా, వైఎస్ కుటుంబసభ్యుల మీదా అనుమానాలు వ్యక్తం చెయ్యడంతో ముఖ్యమంత్రి సిబిఐ విచారణ వద్దు అనడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. కారణం ఏదైనప్పటికీ ఈ కేసు విషయంలో జగన్ వైఖరి ఆయనకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేటు చేసేలా ఉంది. ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తే ప్రభుత్వం తన నిబద్దతను చాటుకోవచ్చు.