YS Jagan no response on SPY Reddy death-కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ, నంది గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. హుద్రోగ, కిడ్నీ సంబంధమైన సమస్యలతో ఏప్రిల్‌ 3న ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన లేకుండా పోయారు. 2004,2009లో కాంగ్రెస్ తరపున నంద్యాల ఎంపీగా ఎన్నికైన ఆయన ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు.

2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి 1.08 లక్షల మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన కనీసం ప్రమాణస్వీకారం కూడా చెయ్యకుండా టీడీపీలో చేరారు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఆయన కోరిన సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించడంతో ఆయన జనసేనకు వెళ్లి వారి కుటుంబానికి ఒక ఎంపీ సీటు, నాలుగు ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నారు. అయితే ఆయన మృతి అనంతరం నీచమైన రాజకీయ కామెంట్లకు దిగారు కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.

తమ పార్టీ నుండి ఫిరాయించిన భూమా నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వర రావు, ఇప్పుడు తాజాగా ఎస్పీవై రెడ్డి ఫిర్యాయింపు పాపం వెంటాడి చనిపోయారని మిగతావారిని కూడా ఆ పాపం వదలదని నీచమైన మాటలు వాడుతున్నారు. ఎస్పీవై రెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తగా, స్వచ్ఛంద సేవకునిగా ఆయన సేవలను కొనియాడారు. అయితే ఇప్పటివరకూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించకపోవడం విచారకరం. జగన్ కు వీడినట్టే, ఎస్పీవై రెడ్డి చంద్రబాబును కూడా వీడి వెళ్ళిపోయారు. అయితే ఆ తరువాత వారు వ్యవహరించిన తీరు ఆయా నాయకుల ఆలోచన సరళిని అద్దం పడుతుంది.