Jagan No Maskఆంధ్రప్రదేశ్ లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. మాస్కులు వేసుకోవడం ఒక్కటే కరోనా ని నిలువరించే మార్గమని నిపుణులు పదే పదే చెబుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తరచూ మాస్కు లేకుండానే ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన వారే ఇలా ఉండటం ఏమిటి అని విమర్శలు వస్తున్నా ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఆ విషయం పక్కన పెడితే… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూమ్ ద్వారానే మీడియాతో మాట్లాడుతున్నారు. నిన్న ఒక ప్రెస్ మీట్ లో చంద్రబాబు మాస్కు పెట్టుకుని మాట్లాడటం గమనించింది. దీని మీద వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

ఆ పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి, కే రవిచంద్ర రెడ్డి ఈరోజు ఉదయం ట్విట్టర్ లో ఆ విధంగా విమర్శలు చేశారు. “ఇంట్లో ఉంటూ.. మాస్క్ తో.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ.. ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న TDP(Total Drama Party) @ncbn అధ్యక్షుడు.. సమాజం పట్ల బాధ్యత లేని…బాబు నాయుడు… ఛీ ఛీ….,” అంటూ ట్విట్ చేశారు.

చంద్రబాబు ఇంటి నుండే మాట్లాడుతుండవచ్చు అయినా ప్రముఖుల చుట్టూ చాలా మంది ఉండడం మాములే… అందులో భద్రతా సిబ్బంది కూడా ఉంటారు. కావున జాగ్రత్తగా ఉండటం తప్పు కాదు. ఒకవేళ ఎవరూ లేకపోయినా చంద్రబాబు వంటి అమితమైన ప్రజాధారణ ఉన్న వారు మాస్కులు పెట్టుకుని ప్రజలకు కనిపిస్తే… దాని వల్ల ప్రజలు కూడా మాస్కుల ఆవశ్యకత తెలుసుకుంటారు. దానిని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు డ్రామా అనడం శోచనీయం. జగన్ ఆదర్శంగా నిలవరు… నిలిచే వారిని మాత్రం విమర్శలు చేస్తారు అంటూ విరుచుకుపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు.