All YSRCP members except Jagan faces suspensionపూర్తి మెజారిటీతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పడగొడతనంటూ వైసీపీ అధినేత వ్యాఖ్యల ఫలితంగా ఎనిమిది మంది వైసీపీ నేతలు అధికార పార్టీలోకి వచ్చారు. అయితే తాజాగా అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చి ముందుగా ప్రకటించిన మేరకే జగన్ నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయానికి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు సర్కారుపై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ కార్యదర్శికి నోటీసు అందజేశారు.

దీనిపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు… కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం అంటూ సమయాన్ని వృధా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అసంతృప్తి ఉంటే నిరసన తెలిపేందుకు చాలా మార్గాలు ఉన్నా, వాటిని ఆశ్రయించకుండా వీగిపోయే అవిశ్వాసాన్ని ప్రతిపాదించడం ఎందుకని మండిపడ్డారు. “మీరు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మీ పార్టీలోని ఎమ్మెల్యేలకు ఎంతమందికి విశ్వాసముంది?” ఎంతమంది అనుకూలంగా ఓటేస్తారు? మీకైనా తెలుసా అంటూ జగన్ ను ప్రశ్నించారు కాల్వ.

అయితే అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని తెలిసి కూడా వైసీపీ ముందడుగు వేయడంపై రాజకీయ విశ్లేషకులు కూడా మండిపడుతున్నారు. బహుశా తన పార్టీలోని మరికొందరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోనున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో… తన పార్టీ సభ్యులలో తన నాయకత్వాన్ని ఎంతమంది సమర్దిస్తారో తెలుసుకోవడానికి ఈ అవిశ్వాసం ప్రవేశపెట్టారేమో అన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. అంతకు మించి ఈ అవిశ్వాస తీర్మానంతో జగన్ వచ్చే లాభమేమీ లేదన్న విశ్లేషణలు వస్తున్నాయి.